వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ- కేంద్రం మధ్య జరిగిన రాజకీయ పంచాయతీ ఇంకా పచ్చిగానే ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఇంకా రగులుతూనే ఉంది. ధాన్యం ఇంకా ఉంది.. కొనాలంటూ తెలంగాణ డిమాండ్ చేస్తోంది. మరో ఆరు లక్షల టన్నులు కొంటామంటూ కేంద్రం రెండు రోజుల కిందటే లేఖ రాసింది. తాజాగా మరో లేఖను కూడా కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి పంపింది. ఆ లేఖ సారాంశం ఏమిటంటే.. గొప్పగా ధాన్యం సేకరించారు.. శభాష్ అని అభినందించడం.
వరి ధాన్యం సేకరణలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. 2020-2021ఖరీఫ్‌లో దేశవ్యాప్తంగా 894.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. గత ఏడాదితో పోల్చితే ధాన్యం సేకరణ 15 శాతం పెరిగింది. గతం కంటే ఎక్కువ ధాన్యం సేకరించిన రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు మరికొన్ని ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. ఏపీ ఆ జాబితాలో లేదు. టార్గెట్ కన్నా ఎక్కువ సేకరించినందున కేంద్రం అభినందించింది. ఇంకాఎక్కువ ఇస్తే ఇంకా ఎక్కువ అభినందిస్తుంది కదా అనే సందేహం చాలా మందికి వస్తోంది
అదే సమయంలో కేంద్ర మంత్రి .. టార్గెట్ ప్రకారం ఇవ్వాల్సిన బియ్యమే ఇవ్వలేదని … తెలంగాణ ఎంపీలపై ఆరోపణలు చేశారు. పార్లమెంట్లో కూడా కొన్ని లెక్కలు చెప్పారు. అయితే ఇప్పుడు టార్గెట్ కన్నా ఎక్కువే ఇచ్చారంటూ కేంద్రం నుంచి ప్రశంసలు వచ్చాయి. దీంతో ఎవరు చెప్పేది నిజమో.. ఎవరికీ అర్థం కాకుండా పోయింది. ధాన్యం రాజకీయంతో అటు టీఆర్ఎస్.. ఇటు బీజేపీ ప్రజల్ని గందరగోళపరిచాయి. రైతుల్ని ఆందోళనలో పడేశాయి. కానీ రైతుల కష్టాలు మాత్రం అలాగే సాగుతున్నాయి.