పదిహేడో తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి విభజన సమస్యలపై చర్చించబోతున్నారు. ఇందులో ప్రత్యేకహోదా అంశం కూడా ఉందని ఓ నోట్ విడుదలయింది. దీంతో ఆ నోట్ బయటకు వచ్చినప్పటి నుండి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుండి ఎండీ భరత్ వరకూ అందరూ ప్రత్యేకహోదా జగన్ కృషి ఫలితమని చెప్పడం ప్రారంభిచారు. ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ఏపీకి ప్రత్యేకహోదాను సీఎం జగన్ సాధించేశారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇది మరీ ఎక్కువ అయిందేమోకానీ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెంటనే తెరపైకి వచ్చారు.
ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై కేంద్ర హోంశాఖ దగ్గర చర్చ జరుగుతుందన్నది అబద్దమని ప్రకటించారు. ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారంతో వైసీపీ నేతలు (ఎదో సాధించారని అనుకున్నానని). కేంద్ర ప్రభుత్వ హోంశాఖ అధికారులను సంప్రదిస్తే అసలు విషయం తెలిసిందన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటే తెలంగాణతో చర్చించాల్సిన అవసరం ఏమిటని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. అసలు ఆ అజెండా కాపీలు బయటకు ఎలా వచ్చాయని జీవీఎల్ ప్రశ్నించారు. కేవలం ఆర్దిక పరమయిన విషయాలు పైనే చర్చ ఉంటుందని చెప్పారు. ఎపీకి కేంద్రం ఆర్దికంగా అన్ని విధాలుగా అండగా ఉంటుందని హోదా పై చర్చ మాత్రం ఉండదన్నారు.
అయితే బీజేపీ తరపున జీవీఎల్ నరసింహారావు స్పందించారు కానీ హోంశాఖ నుంచి అధికారికంగా విడుదలైన పత్రం ప్రకారం ఎనిమిదో అంశంగా ప్రత్యేకహోదా ఉంది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ మళ్లీ సవరణ ప్రకటన చేస్తేనే ప్రత్యేకహోదా అంశంపై చర్చ లేదని అధికారికంగా అనుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.