కొత్త జిల్లాలకు కేంద్రం ఆమోదముద్ర లాంఛనంగా లబించినట్లయింది. కేంద్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్లు జారీ చేసింది. వీటికి స్థానిక ప్రభుత్వాల మ్యాపింగ్‌కు ప్రత్యేకంగా ఎల్జీడీ కోడ్లను జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. జనగణన నుంచి ప్రభుత్వ పథకాల వరకు అన్నీ కోడ్ ద్వారానే అమలు అవుతాయి. ఈనెల 4 నుంచి ఏపీలో మరో 13 జిల్లాలను అదనంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం పాలనను ప్రారంభించింది. ఆ జిల్లాలకు మాత్రం కొత్త కోడ్లు కేటాయించారు.
మన్యం జిల్లాకు 743 కాగా నంద్యాల జిల్లాకు 755 నంబర్లు దక్కాయి. ఈ మధ్యలో ఉన్న నెంబర్లన్నీ మిగతా జిల్లాలవి. దేశంలో ఒక్కో జిల్లాకు ఒక్కో కోడ్ ఉంటుంది. ఆ ప్రకారం చూస్తే.. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 755 జిల్లాలు ఉంటాయి. మామూలుగా జనగణన అయ్యే వరకూ జిల్లాల సరిహద్దులు మార్చవద్దని గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. కానీ కరోనా కారణంగా ఆలస్యమవుతూండటంతో ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో వెసులుబాటు ఇచ్చారు.
జూన్‌లోపు జిల్లాల సరిహద్దులు మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం అంత కంటే ముందుగానే ఏప్రిల్ కల్లా పూర్తిచేయడం.. వెంటనే సీఎం జగన్ ఈ అంశాన్ని ప్రదాని దృష్టికి కూడాతీసుకెళ్లడంతో కోడ్లు జారీ అయ్యాయి. వీటిని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ప్రకటింపచేస్తే.. ఇక సమస్య లేనట్లుగానే భావించాలి.