ఎప్పటికి ఏది అవసరం అనుకుంటే అది మాత్రమే మాట్లాడేవారు ఉంటారు! అలాంటివారిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరు అనే విమర్శ వినిపిస్తూ ఉంటుంది. మార్పును అందిపుచ్చుకోవడంలో ఆయన తరువాతే ఎవరైనా అనేవారు కూడా ఉన్నారు. కేంద్రం పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తరువాత, పరిస్థితులను అర్థం చేసుకుంటూ సందర్భానుసారం చంద్రబాబు మాట్లాడుతున్నారని చెప్పాలి. మొన్నటికి మొన్న మాట్లాడుతూ… పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చాలా పెద్ద సమస్యగా మారిందనీ, ఇది మనం కోరుకున్నది కాదని అన్నది ఆయనే కదా. తన రాజకీయ జీవితంలోనే ఇంతటి జఠిలమైన సమస్యను చూడలేదనీ, ఆగస్టు సంక్షోభాన్ని తట్టుకున్నాననీ, హుద్‌హుద్ తుఫాను కూడా తట్టుకున్నాననీ, కానీ నగదు కొరత సమస్య ఎప్పటికి తీరుతుందో అర్థం కావడం లేదని కూడా చెప్పారు కదా! అంతకుముందు బ్యాంకర్లకు క్లాసులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడా వ్యాఖ్యలన్నింటిపైనా చంద్రబాబు యూటర్న్ తీసుకుంటున్నారు అనిపిస్తోంది.
తాజాగా, ఆయన ఇదే అంశమై మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు చేయాలని తానే కేంద్రానికి సూచించారన్నారు. నోట్ల రద్దు తరువాత అమలు క్రమంలోని లోటుపాట్లను మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానీ, కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తాను వ్యతిరేకం కాదని అనడం విశేషం. మరైతే, గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మాటేంటీ అంటారా? చాలా సింపుల్.. అదంతా మీడియా వక్రీకరణ అనేశారు. ఇంతకీ, ఉన్నట్టుండి చంద్రబాబు వ్యాఖ్యల్లో ఇలాంటి మార్పులూ చేర్పులూ ఎందుకొస్తున్నాయంటే… ఢిల్లీ పెద్దల ప్రభావం అంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఓసారి భాజపాను వ్యతిరేకిస్తూ… మరోసారి మెచ్చుకుంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతోంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత చంద్రబాబు అవలంభిస్తున్న ఈ గోడ మీది పిల్లి వాటం వైఖరిపై కొంతమంది భాజపా పెద్దలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆ విషయం ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చేసిందనీ, ఆ మాట చంద్రబాబు చెవిన కూడా పడిందని అంటున్నారు. అందుకే, కేంద్రానికి మరింత అనుకూలంగా చంద్రబాబు మళ్లీ వ్యాఖ్యానిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటిదేదో లేకపోతే చంద్రబాబు ఇలా ఎందుకు మాటలు మార్చేస్తుంటారు చెప్పండీ!