సివిల్ సర్వీస్ కేడర్ రూల్స్ మార్పు విషయంలో బీజేపీయేర సీఎంలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ లేఖలు రాస్తే.. ఏపీ సీఎం జగన్ మాత్రం స్వాగతించారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖకుసంబంధం లేకపోయినప్పటికీ.. కాసేపటికే ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు రుణాల సేకరణకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు రాజస్థాన్‌కు అదనపు రుణాల సేకరణకు అనుమతినిచ్చింది.
విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రూ. 7,309 కోట్ల రుణాల సేకరణకు ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,123 కోట్లు, రాజస్థాన్ రూ. 5,816 కోట్ల రుణాలను సేకరించుకునేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. పదకొండు రాష్ట్రాలు ధరఖాస్తు చేసుకుంటే అందులో రెండు రాష్ట్రాలకు పర్మిషన్ ఇచ్చారు. రెండింటిలో ఏపీ ఒకటి. విద్యుత్ సంస్కరణలు అమలు చేసినందుకు అంటే… పొలాల్లో రైతుల కరెంట్‌కు మీటర్లు పెట్టినందుకు ఈ రుణం తీసుకోవచ్చన్నమాట.
అయితే ఇంకా ఆర్బీఐ నుంచి బాండ్లు వేలం వేసి తీసుకునే రుణానికి మాత్రం ఇంకా పర్మిషన్ రాలేదు. ఇప్పటికే తీసుకోవాల్సిన రుణం కన్నా ఎక్కువ తీసుకున్నారని కేంద్ర అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. కానీ నిధుల ఇబ్బంది లేకుండా ముందస్తుగా పన్నుల వాటా ఇవ్వడం.. ఇతర రూపాల్లో సాయం చేయడం చేస్తున్నారు.