పేదలను అడ్డం పెట్టుకుని వారి గొంతు కోసి రాజకీయాలు చేయడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంతకు దిగజారిపోయిందో మరోసారి బట్ట బయలు అయింది. ఆర్ 5 జోన్ లో ఇళ్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. యాభై వేల ఇళ్ల నిర్మాణానికి చాన్స్ ఇచ్చింది.. ఇంత వేగంగా ఎలా ఇచ్చిందా అని చాలామంది ఆశ్చర్యపోయారు. నిజానికి అవి రాయలసీమ పేదలకు కేటాయించిన ఇళ్లు. వాటిని కట్టని ప్రభుత్వం కేంద్రానికి సరెండర్ చేసింది. వాటినే అమరావతిలో మంజూరు చేయాలని కోరింది. అదే ప్రకారం మంజూరు చేశారు. అంటే రాయలసీమ పేదలకు దక్కాల్సిన ఇళ్లను అమరావతిలోని ఆర్ 5 జోన్ లో కట్టడానికి మళ్లించిందన్నమాట.
రాయలసీమ పేదల్ని కొట్టి అమరావతి పేదలకు పెడుతున్నారన్నమాట. ఈ విషయంపై స్పష్టత రావడంతో కడప జిల్లాకు చెందిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వెంటనే.. కేంద్ర మంత్రి హర్దిప్ సింగ్ పూరికి లేఖ రాశారు. రాయలసీమ ఇళ్లను సరెండర్ చేసి.. రాజధాని విధ్వంసం కోసం వాటిని అటు బదలాయించారని ఇందు కోసం ఇచ్చిన అనుమతుల్ని తక్షణం రద్దు చేయాలని ఆయన లేఖలో కోరారు. ఇదే విషయాన్ని ఆయన పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు
అసలు సుప్రీంకోర్టులో ఉన్న స్థలంలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతించడమే వివాదం అయితే.. . అందులోనూ రాయలసీమ పేదలకు కేటాయించిన ఇళ్లను రద్దు చేసి వివాదాస్పద ఇళ్లకు కేటాయించడం మరో వివాదం అవుతోంది. దీనిపై ఇప్పటికే కేంద్రానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయని చెబుతున్నారు. మరి కేంద్రం .. బీజేపీ పెద్దలు ఈ విషయాలను పట్టించుకుంటారో లేదో !