హనుమంతుని జన్మస్థలం తిరుమల జాపాలి తీర్థంలోని అంజనాద్రేనని వాదిస్తున్న టీటీడీకి కేంద్రం షాకిచ్చింది. అంజనాద్రి పర్వతాన్ని హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించే ప్రతిపాదన ఏదీ లేదని తేల్చి చెప్పేసింది. ఈ విషయాన్ని కేంద్రంతో చెప్పించిది ఎవరో కాదు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డినే. అంతకు మించిన ప్రజా సమస్యలు లేవన్నట్లుగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్న వేశారు. టీటీడీ … హనుమంతుడి జన్మస్థలాన్ని నిర్ధారిచిందని.. ఆ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని ఆయన ప్రశ్న వేశారు. దానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూటిగా సమాధానం ఇచ్చారు. అలాంటి ఆలోచనే లేదని తేల్చి చెప్పారు.
నిజానికి టీటీడీది సొంత నిర్ణయం. టీటీడీనే నిపుణుల కమిటీ నియమించి.. ఆ మేరకు పరిశోధనలు చేయించి.. ప్రాచీన సాహిత్యం, శాసనాలు, చారిత్రక, ఖగోళ శాస్త్ర అంచనాలు వంటి ఆధారాలు ఉన్నాయని చెప్పి.. ప్రకటన చేసేసింది. దీనిపై తీవ్రమైన వివాదం రేగింది. ఇప్పటి వరకూ ఎక్కువ మంది హనుమాన్ జన్మస్థలం.. కర్ణాటకలోని కిష్కింధగా నమ్ముతుంటారు. భక్తులూ అక్కడికే వెళ్తూంటారు. టీటీడీ ప్రకటనపై అక్కడి ట్రస్ట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అటు టీటీడీ .. ఇటు కిష్కింధ ట్రస్ట్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. అయినా వివాదం తేలలేదు.
అసలు ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. అలాంటి విషయాల్లో జోక్యం చేసుకోదు కూడా.అయినా తగుదునమ్మా అంటూ విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ప్రశ్న వేసి మరింత వివాదం రాజేశారు. ఇప్పుడు కేంద్రం గుర్తించడం లేదని.. కొంత మంది విమర్శలు ప్రారంభిస్తారు. దేవుడ్ని వివాదంలోకి తీసుకు రావడం కూడా సరికొత్త రాజకీయం అన్నట్లుగా మారిపోయింది. తిరుమల శ్రీవారి అతి పెద్ద పుణ్యక్షేత్రంగా ఉండగా… ఆ కొండలనే .. హనుమంతుడి జన్మస్థలంగా ఎందుకు ప్రసిద్ధి చేయాలనుకుంటున్నారో.. భక్తులకు కూడా అర్థం కావడం లేదు.