ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి దండిగా నిధులు విడుదలవుతున్నాయి. తాజాగా రెవిన్యూ లోటు భర్తీ కింద కేంద్రం రూ. 1438 కోట్లు విడుదల చేసింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి ఈ నిధులు రిలీఫ్ లాంటివి. ఇప్పటికీ కొంత మందికి అందని పెన్షన్లు, జీతాల సమస్య తీరిపోతుంది. చెల్లింపులు చేయాల్సిన వారికి చేయవచ్చు. 15వ ఆర్థిక సంఘం లోటుతో ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేయాలని సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుల ప్రకారం కేంద్రం లోటు భర్తీకి నిధులు విడుదల చేస్తూ ఉంటుంది.
తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంది కాబట్టి ఆ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా రాదు. ఈ నెల మొదట్లోనే జీఎస్టీ పరిహారం కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.823.17 కోట్లు విడుదల చేసింది. జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రానికి జరిగే పన్ను నష్టాన్ని భర్తీ చేయాల్సి ఉంది. ఈ ప్రకారం పరిహారం కింద నిధులు విడుదల చేస్తోంది. ఇందులో ఇప్పటి వరు ఏపీకి రూ.2,311 కోట్ల పరిహారం ఇచ్చింది. పరిహారం అయినా.. లోటు భర్తీ అయినా.. కేంద్ర గ్రాంట్లు అయినా ఏదో రూపంలో ఏపీ ప్రభుత్వానికి నెలకు రూ. రెండు వేల కోట్లకుపైగానే నిదులు వస్తున్నాయి.
అదనంగా వస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వానికి కష్టాలు తీరడం లేదు. మరో వైపు ఈ నిధుల అంశాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఏపీకి విపరీతంగా సాయం చేస్తున్న మోడీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు చెబుతూ ఆ పార్టీ నేతలు ట్వీట్లు చేస్తున్నారు. అయితే అదనంగా ఇచ్చిన సాయం ఏమీ కాదని.. చట్టం ప్రకారమే ఇస్తున్నవని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఎలక్టోరల్ బాండ్ల నిధుల్లో టీఆర్ఎస్, వైసీపీ దూకుడు !
అధికారంలో ఉన్న పార్టీకి విరాళాలివ్వడానికి అందరూ ఉత్సాహం చూపిస్తారు. బీజేపీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల విధానాన్ని తీసుకు వచ్చింది. దీని ప్రకారం ఎవరు ఇస్తున్నారో తెలియకపోయినా ఎన్ని కోట్లయినా విరాళాలు తీసుకోవచ్చు. సహజంగానే బీజేపీకి అందరూ ఇస్తారు. అయితే ప్రాంతీయపార్టీల్లో బీజేపీ స్థానాన్ని టీఆర్ఎస్ దక్కించుకుంది. దేశంలోని 42 ప్రాంతీయ పార్టీల్లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అత్యధిక మొత్తం అందుకుంటున్న పార్టీ టీఆర్ఎస్. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.130.46కోట్ల ఆదాయాన్ని విరాళాల రూపంలో పొందింది టీఆర్ఎస్.
ఇక ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడో స్థానం దక్కింది. రెండో స్థానంలో శివసేన ఉంది. ఈ పార్టీకి రూ. 111.403కోట్ల విరాళాలొచ్చాయి. మూడో స్థానంలో వైసీపీ ఉంది.. ఈ ప ార్టీకి రూ. 92.739కోట్లు విరాళాలొచ్చాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆప్, డీఎంకే సహా 14 ప్రాంతీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 447.49కోట్లు విరాళాలు అందాయి. 42 పార్టీల్లో 14 మాత్రమే విరాళాల వివరాలను బయటపెట్టాయి.
ఆదాయం వస్తోంది కానీ టీఆర్ఎస్ అసలు ఖర్చు చేయడం లేదు. మొత్తం ఆదాయంలో పదిహేనుశాతం కూడా ఖర్చు చేయడం లేదు. మిగతా అంతా మిగులులోనే ఉంది. అధికార పార్టీలు అన్నీ అంతే. అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు మాత్రం విరాళాలు తగ్గిపోతున్నాయి… ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేసి తెలుగు దేశం పార్టీ లోటులోకి వెళ్లిపోయింది. నిన్నామొన్నటి వరకూ ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ప రిస్థితి కూడా అంతే ఒక్క బీజేడీ మినహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఆదాయానికి మించి ఖర్చుల్లోనే ఉన్నాయి.