వరదల కారణంగా భారీగా నష్టపోయిన ఏపీకి కేంద్రం రూ. 1036 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు రూ.416.80 కోట్లు విడుదల చేశారు. ఇటీవల ఏకధాటిగా కురిసిన వర్షాలకు విజయవాడ నీట మునిగింది. అలాగే పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. తెలంగాణలో ఖమ్మం జిల్లాకు మరింత నష్టం జరిగింది. ఈ క్రమంలో కేంద్ర బృందాలు వచ్చి.. నష్టాన్ని పరిశీలించి వెళ్లాయి. నివేదికలను పరిశీలించిన తర్వాత NDRF నిధుల నుంచి కేంద్రం నిధులు మంజూరు చేసింది.
విజయవాడ ఎక్కవగా ఇబ్బంది పడటంతో చంద్రబాబునాయుడు రేయింబవళ్లు విజయవాడలోనే ఉండి పరిస్థితిని చక్కదిద్దారు. తరవాత అందరికీ సాయంచేశారు. ప్రతి ఒక్క ఇంటికి పరిహారం, సాయం అందేలా చూశారు. విజయవాడ ప్రజలకు అండగా ఉండటానికి.. అనేక మంది విరాళాలు ఇచ్చారు. ఇలా నాలుగు వందల కోట్లుకుపైగా వచ్చాయని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే ఆరు వందల కోట్లను పరిహారంగా ప్రకటించారు.
మొత్తంగా వరదల వల్ల ఏడు వేల కోట్లుకుపైగా నష్టం జరిగిందని తేల్చారు. అనేక రహదారులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. వాటన్నింటినీ సాధారణ స్థితికి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. కేంద్రం ఉదారంగా వ్యవహరించి వెయ్యి కోట్లు మంజూరు చేసిందనే అనుకోవాలి. గతంలో విపత్తు నిధుల్ని వచ్చిన వెంటనే ఖాళీ చేసేసేవారు.