ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయిల కాయిన్‌ను కేంద్రం విడుదల చేయనుంది.అయితే ఇది సాధారణ వంద రూపాయల కన్నా అత్యధిక రేటు ఉంటుంది.ఎందుకంటే ఈ కాయిన్ ను వెండితో రూపొందిస్తారు. ఎన్టీఆర్ శత జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న టైంలో మరో శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఈ కాయిన్‌ను ముద్రిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ విషయంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ లీడర్ పురంధేశ్వరి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆమె తోనే ప్రభుత్వ నాణెలు ముద్రించే మింట్ అధికారులు మాట్లాడారు. ఆమెను కలిసి ఎన్టీఆర్ ఫొటో ఉన్న వంద రూపాయల కాయన్ నమూనాను కూడా చూపించారు. ఎన్టీఆర్ బొమ్మను వంద రూపాయల నాణెంపై ముద్రించేందుకు ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు గతేడాది జూన్‌లోనే కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపారు.అది ఇప్పుడు కార్యాచరణలోకి వస్తోంది.
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి నాణేలు విడుదల చేస్తూ ఉంటారు. జ్ఞాపికలుగా ఉంచుకోవడానికి ప్రజలు కొనుగోలు చేస్తూ ఉంటారు. దీని విలువ రూ. వంద అని ఉన్నప్పటికీ వెండితో చేస్తున్నందున ఎక్కువ ధరకు అందుబాటులోకి వస్తుంది. సాధారణంగా చెలామణిలో ఉండే నగదుపై జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది. నాణెలపై మాత్రం పలువురు స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను ముద్రించేవారు.
ఇలా మహనీయుల ఫోటోలతో జ్ఞాపికలుగా ఉంచుకునేందుకు నాణేలను విడుదల చేస్తారు. ఈ అరుదైన గౌరవం ఎన్టీఆర్‌కు దక్కబోతోంది.