ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనే.. ఆంధ్రప్రదేశ్ బృందంపై ఆంక్షలు విధించిన కేంద్రం.. చివరికి వెనక్కి తగ్గక తప్పలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహారాన్ని తీసుకోవడంతో.. కేంద్ర ప్రభుత్వ వర్గాలు.. ఉన్న పళంగా… స్పందించాయి. అప్పటి కప్పుడు… కొత్తగా వివరాలు తెప్పించుకుని… చంద్రబాబుతో పాటు 17 మంది బృందం… దావోస్వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. అధికారులు కాస్త ముందే వెళ్లినా… చంద్రబాబు మాత్రం 22వ తేదీన దావోస్ వెళ్లనున్నారు. నాలుగు రోజుల పాటు సదస్సులో పాల్గొంటారు. పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతారు. 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకల్లోపాల్గొనడానికి తిరిగి వస్తారు. రెండు రోజుల కిందట… ఏపీ ప్రభుత్వం పంపిన వివరాలను కాదని.. సీఎంతో పాటు ఐదుగురికి మాత్రమే అనుమతిచ్చింది.
ఏ ముఖ్యమంత్రి అయినా అధికారిక హోదాలో … విదేశాల్లో పర్యటించాలంటే.. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఇది ఓ సంప్రదాయంలా జరుగుతోంది. కేంద్ర విదేశాంగ శాఖకు పర్యటన వివరాలు పంపితే… వారు ఆమోద ముద్ర వేస్తూ లేఖ పంపుతారు. కేంద్ర విదేశాంగ శాఖ ఆ వివరాలను… ముఖ్యమంత్రి పర్యటించబోయే దేశంలోని రాయబార కార్యాలయానికి పంపుతారు. అప్పుడు అది అధికారిక పర్యటన అవుతుంది. ఇంత వరకూ ముఖ్యమంత్రి హోదాలో.. ఇలా విదేశాలకు వెళ్లాలనుకున్న వారికి.. ఆంక్షలు పెట్టిన సందర్భం లేదు. మొదటి సారి చంద్రబాబు పర్యటనపై .. కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేసింది. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్ సదస్సును మించిన అవకాశం ఉండదని ముఖ్యమంత్రి భావిస్తూంటారు. ప్రపంచ పెట్టుబడిదారులందరూ సదస్సుకు వస్తారు. వారిలో చాలా మంది… ఇతర దేశాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించేందుకే వస్తారు. అలాంటి వారికి ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రజెంటేషన్లు ఇవ్వడం ద్వారా ఆకట్టుకోవాలని చంద్రబాబు ప్రతీ ఏడాది ప్రయత్నిస్తూంటారు.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నిర్వాహకులు కూడా.. ఈ విషయంలో చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం పంపుతూ ఉంటారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ గురించి దావోస్లో చంద్రబాబు విభిన్న వ్యుహాలతో ప్రచారం చేస్తున్నారు. హోర్డింగులు పెడుతున్నారు. బస్సులపై కూడా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇక ప్రత్యేకమైన స్టాల్ కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో.. ఏపీ పట్ల.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. కేంద్రం ప్రమేయం ఉన్న ప్రతీ విషయంలోనూ.. ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. చివరికి ముఖ్యమంత్రి విదేశీ పర్యటన విషయంలోనూ ఆంక్షలు పెట్టడంపై… తీవ్ర నిరసన వ్యక్తమయింది. దాంతో కేంద్రం… గంటల్లోనే దిగి రావాల్సి వచ్చింది..