తెలంగాణ సర్కార్‌కు కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఓ రకంగా న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకోవచ్చు. కొత్త సచివాలయం నిర్మాణానికి కేంద్రం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఇప్పటి వరకూ కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న సమస్యలన్నీ తిరిపోయినట్లయ్యాయి. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న స్థలంలో కట్టాలనుకున్న భవనానికి పర్యావరణ అనుమతులు ఇవ్వడం కష్టమన్నచర్చ జరిగింది. దానికి తగ్గట్లుగానే కేంద్రం ఆ దరఖాస్తును పెండింగ్‌లో పెట్టింది. టెండర్లు పూర్తయినా ఈ కారణంగానే నిర్మాణం ఇంకా ప్రారంభించలేదు. ఇప్పుడు.. ఆ సమస్య తీరిపోయింది.
కేసీఆర్ కొత్త సచివాలయం కట్టాలని ఏళ్ల నుంచి అనుకుంటున్నారు.. కానీ రకరకాల కారణాలతో సాధ్యం కావడం లేదు. మొదట్లో స్థలం కోసం.. తర్వాత కోర్టు చిక్కుల వల్ల పెండింగ్ పడిపోయింది. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఏపీకి చెందిన భవనాలన్నింటినీ స్వాధీనం చేసుకోవడంతో స్థలం సమస్య తీరిపోయింది. అన్నింటినీ కూలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టాలనుకునే సమయానికి కోర్టు కేసులువచ్చాయి. చివరికి అన్నింటినీ అధిగమించి కూలగొట్టారు. ఇక ఏ అడ్డంకి లేదనుకుని టెండర్లు పిలిచి డిజైన్లు ఖరారు చేసి.. రెడీ అయ్యారు. ఈ లోపు పర్యావరణ అనుమతుల సమస్య వచ్చింది. మిగతా అనుమతులన్నీ రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఉంటాయి కానీ.. పర్యావరణ అనుమతులు మాత్రం కేంద్రం ఇవ్వాల్సిందే.
కేంద్రంతో నిన్నామొన్నటిదాకా సఖ్యత లేదు. కొత్త సచివాలయానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు కూడా ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో పర్యావరణ అనుమతులు పెండింగ్‌లో పడ్డాయి. అయితే.. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్ తన పాలసీ మార్చుకున్నారు. దీంతో.. ఢిల్లీ కూడా తన పాలసీ మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా పర్యావరణ అనుమతులు మంజూరు చేశారు.