ఏబీ వెంకటేశ్వరరావును సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని ప్రభుత్వం పంపిన సిఫారసును కేంద్రం తోసి పుచ్చింది. అయితే ప్రభుత్వం పంపిన నివేదికను బట్టి ఆయనకు ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లను నిలిపివేయచ్చని తెలిపింది. అయితే ఎప్పుడో డీజీపీ క్యాడర్‌కు చేరుకున్న ఏబీ వెంకటేశ్వరరావు కొత్తగా ఎలాంటి ఇంక్రిమెంట్లు రావని.. రద్దు చేసేవేమీ కూడా ఉండవని సర్వీసు నిపుణులు చెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీవీపై కక్ష సాధింపులకు దిగింది. అసలు కొనుగోలే చేయని నిఘా పరికరాల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసి ఆయనను సస్పెండ్ చేశారు. ఆ విచారణ జరుగుతూండగానే 2021 ఆగస్టులో ఏబీవీపై మేజర్ పెనాల్టీ (డిస్మిస్) అమలు చేయాలని కేంద్ర హోం శాఖకు ఈ జీవో ద్వారా ప్రతిపాదనలు ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపారు. ఆయన సర్వీసులో కొనసాగేందుకు అనర్హుడని, ఆయన్ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. అఖిల భారత సర్వీసు అధికారుల డిస్మిస్ వ్యవహారాలన్నీ కేంద్రమే చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసులను, అభియోగ పత్రాలను క్షుణ్నంగా పరిశీలించిన … యూపీఎస్సీ డిస్మిస్ చేసేందుకు నిరాకరించింది.
తనపై కేసుల విషయంలో ఇప్పటికీ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో పోరాడుతున్నారు. కేసులు విచారణకు రావాల్సి ఉంది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తి వేసి జీతం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చివరి క్షణంలో పోస్టింగ్ ఇచ్చి మళ్లీ సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ చర్యలను క్యాట్‌లో ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.