ఆన్ లైన్ విద్య పేరుతో నమ్మిన ఖాతాదారుల్నే కాదు.. పెట్టుబడిదారుల్ని.. అప్పులు ఇచ్చిన వారిని కూడా అడ్డగోలుగా ముంచేసిన బైజూస్ వ్యవహారంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ సంస్థ అకౌంట్ బుక్స్ మొత్తం చెక్ చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రత్యేకంగా నియమించిన అధికారుల బృందానికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బైజూస్ వ్యవహారం వివాదాస్పదం అయింది. నివేదిక తర్వాత బైజూస్ కంపెనీ వ్యవహారాలను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు.
బైజూస్ ఆర్థిక పరిస్థితి బయటకు తెలియడం లేదు. అసలు ఆ కంపెనీ సమయానికి రిటర్నులు కూడా దాఖలు చేయడం లేదు. ఆడిటర్ కూడా రాజీనామా చేశారు. అసలు ఆదాయం కన్నా నష్టాలు రెండు రెట్లు ఎక్కువ చూపిస్తున్నారు. అకౌంటింగ్ వ్యవహారమూ తేలడం లేదు. మరో వైపు రుణదాతలకు చెల్లించాల్సిన మొత్తాలను చెల్లించడం లేదు. దీంతో అమెరికాలో కూడా కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అదే సమయంలో బైజూస్ కంపెనీ వాల్యూ దారుణంగా పడిపోతోంది.
ఆదాయానికి, ఆస్తులకు.. వ్యాపారానికి .. బైజూస్ రవీంద్రన్ చేస్తున్న ప్రకటనలకు పొంతన లేకుండా పోయింది. ఈ వ్యవహారం కారణంగా ఇప్పటికే బైజూస్ ఖాతాదారులు దారుణంగా తగ్గిపోయారు. అప్పులు తెచ్చి.. టేకోవర్ చేసిన ఆకాష్ ఎడ్యూకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ కూడా చేతులు మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకాష్ ట్యూషన్స్ పేరుతో పెట్టిన ప్రాజెక్టులు ఏ మాత్రం సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో బైజూస్ భవితవ్యాన్ని కేంద్రం తేల్చే అవకాశం ఉంది.