అమరావతే రాజధాని అని ప్రజా తీర్పు, రాజధాని ప్రాంతంలో మౌళిక సదుపాయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూమిలిచ్చేందుకు సర్కార్ ముందుకొస్తున్న నేపథ్యంలో సానుకూల వాతావరణం ఏర్పడుతోంది.
ఇప్పటికే రాజధాని ప్రాంతంకు వచ్చి, జగన్ సర్కార్ ఒత్తిడి తట్టుకోలేక వెళ్లిపోయిన అశోక్ లేలాండ్ వంటి ప్రముఖ సంస్థలు తిరిగి వస్తున్న నేపథ్యంలో… దాదాపు 45 కేంద్ర సంస్థలు కూడా రాజధానిలో కార్యకలాపాలు స్టార్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి.
రాజధాని ప్రాంతంలో తమకు స్థలాలు కేటాయిస్తే తమ కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు సిద్దం అని సీఆర్డీఏకు పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు సమాచారం ఇచ్చాయి. సీఆర్డీఏ కూడా వారితో సంప్రదింపులు జరుపుతోంది. ఇండియన్ నేవీ, ఇండియా పోస్ట్, సీబీఐ, నాబార్డు, ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్.ఐ.సీ, గెయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి ప్రముఖ సంస్థలు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయి.
ఇందులో చాలా సంస్థలకు సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడే కొంత స్థలాన్ని కేటాయించారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారటం, జగన్ రాజధానిని మార్చేస్తానని కాలం గడపటంతో ఆ సంస్థలు రాలేకపోయాయి. కానీ, ఇప్పుడు మళ్లీ ముందుకు వస్తుండగా… స్థలం కేటాయించని సంస్థలు కూడా తమకు స్థలం ఇస్తే వస్తామని సీఆర్డీఏతో సంప్రదింపులు జరుపుతున్నాయి.