ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. కేంద్రానికి ఎంతగా సహకరిస్తున్నా… ఢిల్లీ సర్కార్ మాత్రం.. ఏపీ ప్రయోజనాలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏపీకి కేంద్రం కేటాయిస్తుందని ఆశలు పెట్టుకున్న మందాకిని బొగ్గు గనిని కర్ణాటకకు ఇచ్చేశారు. ఈ గని కోసం.. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రయత్నిస్తున్నారు. కేంద్రానికి లేఖలు కూడా రాశారు. గత ఏడాది నవంబర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి జగన్ లేఖ రాశారు. అందులో ఏపీ ఎదుర్కొంటున్న విద్యుత్ కష్టాలు.. బొగ్గు కొరత గురించి వివరించారు.
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ల నుంచి బొగ్గు సరఫరా ఒప్పందాలున్నాయి. 5వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి స్థాయిలో పని చేస్తే నెలకు 12లక్షల టన్నుల బొగ్గు అవసరం. కరెంట్ ఉత్పత్తి డిమాండు ఉన్న సమయంలో అక్కడి నుంచి బొగ్గు అందడం లేదు. అందుకే సొంతంగా మందాకిని గని కేటాయించాలని కోరుతోంది. ఒడిశాలోని తాల్చేరు గనికి బదులుగా దీన్ని కేటాయించాలని కోరుతూ సీఎం కేంద్రానికి లేఖ రాసినా పరిగణనలోకి తీసుకోలేదు. ఒడిశా తాల్చేరులో మందాకిని బొగ్గు క్షేత్రం ఉంది.
ముఖ్యమంత్రి జగన్.. గత నవంబర్లో ప్రధానికి రాసిన లేఖలో..ఏపీ విద్యుత్ కష్టాలను వివరించారు. బొగ్గు అవసరాన్ని నొక్కి చెప్పారు. అయినా.. కేంద్రం మాత్రం.. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఆ గనిని కర్ణాటకకు కేటాయించారు. దీంతో ప్రభుత్వం నిరాశకు గురయింది. తాము కేంద్రానికి ఎప్పటికప్పుడు సహకరిస్తున్నా.. కేంద్రం.. కనీస వసతులకు అవసమయ్యే.. విజ్ఞాపనులు కూడా పట్టించుకోడం లేదన్న అసంతృప్తి ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఏడాది కాలంలో కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదని.. నిరాశకు గురవుతున్నారు. అయినా ఎంపీలు నోరెత్తలేని పరిస్థితుల్లో ఉన్నారు.