ఆంధ్రప్రదేశ్ కోణం నుంచి చూసినపుడు కేంద్ర మంత్రివర్గ విస్తరణ వల్ల అదనపు ప్రయోజనాలేమీ లేవు. కొత్తగా మంత్రులైన 19 మందీ సహాయమంత్రులే కాబట్టి వారెవరికీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారంలేదు. అయితే పర్యవరణశాఖ ఇండిపెండెంట్ మంత్రిగా వున్న ప్రకాష్ జవదేకర్ కేబినెట్ మంత్రిగా మానవ వనరుల శాఖకు ప్రమోట్ అవ్వడం ఎపి కి ఎంతో కొంత ఉపయోగమే!
తెలుగుదేశం, బిజెపి పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదిర్చిన మధ్యవర్తిగా మాజీ బ్యాంక్ అధికారి అయిన 61 ఏళ్ళ జవదేకర్ తెలుగుదేశం నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగివున్నావారే! ఆయన పర్యవరణ మంత్రి అయ్యాక రాజధాని లేని ఎపికి, పోలవరం ప్రాజెక్టుకి ఫారెస్టు లాండు క్లియరెన్సులు ఇచ్చారు. ఆ మంజూరులలో ఒడిస్సా అభ్యంతరాలను కూడా పక్కన పెట్టి, నియమ నిబంధనలకంటే తక్షణ అవసరాలను, వాస్తవిక దృక్పధాన్ని, రాజకీయ అవసరాన్నే జవదేకర్ హెచ్చుగా ప్రదర్శించారు. ఎన్నికలపొత్తు సమయంలో తెలుగుదేశం ప్రతినిధి అవమానకరంగా వ్యవహరించినపుడు చంద్రబాబు జోక్యం చేసుకుని పరిస్ధితిని చక్కదిద్దారు. తరువాత జవదేకర్ తోపాటు సుజనా చౌదరి కూడా కేంద్రమంత్రి అయ్యారు. కేంద్ర ప్రభుత్వ పధకాలను వీలైనంతగా ఎపికి రాబట్టే విధంగా కేంద్రానికీ, రాష్ట్రానికీ సమన్వయ బాధ్యతలు చూస్తున్న సుజనా చౌదరి రెగ్యులర్ గా జవదేకర్ తో టచ్ లోనే వున్నారు.
మానవవనరుల శాఖ ద్వారా ఉన్నత విద్యా వ్యవహారాలు చూసిన స్మృతి ఇరానీ కంటే అదేశాఖలోకి వచ్చిన జవదేకర్ ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణాకి కూడా దగ్గర మనిషే! ఈ అవకాశాన్ని వినియోగించుకుని లాబీ చేయగలిగితే ఆయన ద్వారా హెచ్చుగా, ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలో ప్రయోజనాలు సాధించవచ్చు.!
ఎక్కడకూర్చున్నా వడ్డించే వాడి కి మనం తెలుసుకాబట్టి ఏది కావాలో అడగడానికి ఏక్సెస్ మనకి వుందన్న ధీమా ఇది!
మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ మరికొందరు మంత్రుల శాఖలు మార్చివేయటం ద్వారా మోదీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. మంత్రివర్గం విస్తరణలో క్యాబినెట్ మంత్రులను చేర్చుకుని పాత మంత్రుల శాఖలను ప్రధాని పెద్దగా మార్చకపోవచ్చుననుకున్న వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఇంత కాలం అత్యంత ముఖ్యమైన మానవ వనరుల శాఖను నిర్వహించిన స్మృతి ఇరానీని జౌళి శాఖకు పరిమితం చేయటం గమనార్హం. ప్రకాశ్ జవడేకర్‌కు మానవ వనరుల శాఖ లభించింది. అందరు అనుకున్నట్లే ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ వద్ద అదనంగా ఉన్న సమాచార శాఖను తొలగించి ఎం.వెంకయ్యనాయడుకు ఇచ్చారు. వెంకయ్యనాయుడు ఇంత కాలం నిర్వహించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖను తొలగించారు. అయితే పట్టణాభివృద్ది తదితర పాత శాఖలు ఆయన వద్దే ఉంటాయి. రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, మనోహర్ పరిక్కర్, ఉమాభారతి, నితిన్ గడ్కరీ,సురేష్ ప్రభు శాఖల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడకు స్టాటిస్టిక్స్,ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ శాఖను కేటాయించారు. ఎరువులు, రసాయనాల శాఖను నిర్వహిస్తున్న ఆనంతకుమార్కు అదనంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖను కేటాయించారు. సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు న్యాయ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాను పౌరవిమాన శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు.
వెంకయ్య నాయుడుకి పార్లమెంటరీ వ్యవహారాలు వుంచినా తీసేసినా మనకుపోయేదీలేదు…వచ్చేదీ లేదు. ఆంధ్రప్రదేశ్ మీద ఆయన పక్షపాతం దాచుకోవాలనుకున్నా దాగేదికాదు. ఆయన ఏశాఖలో వున్నా ఎపి కి చేయగలిగినంతా చేస్తారు. ఆయనకు కొత్తగా వచ్చిన సమాచారశాఖ బిజెపి ప్రచారానికి బాగా దోహదపడుతుంది. ఏమి చెబితే ఏన్యూస్ టివిలో హైలైట్ అవుతుంది? జోనల్, డిస్ట్రిక్ట్, రీజనల్, ఎడిషన్, ఆల్ ఎడిషన్ లకు ఇవ్వవలసిన వార్తలు ఏమిటి అనే వివరాలు వెంకయ్యనాయుడుకి తెలిసినంతగా బిజెపిలో మరో నాయకుడికి తెలియదు.