ప్రాంతీయ పార్టీల వల్ల ప్రయోజనం లేదనీ, తాము గెలిస్తేనే ఎపికి ప్రత్యేక హౌదా నిధులు వస్తాయని ఎపి కాంగ్రెస్ ప్రధాన వాదన. టిడిపి పాలనపై ధ్వజమెత్తినా వారిలో నోరుగల వారెవరూ వైసీపీ దూకుడును ఆమోదించడానికి సిద్దంగా లేరు. కొన్నిసార్లు టిడిపిని మించి జగనపై దాడి చేస్తుంటారు. అయితే అది తమను టిడిపితో లాలూచీ పడినట్టు ఆరోపణలకు గురి చేయొచ్చనే ఆందోళన కొందరిలో వుంది. ఎపికి జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టి పెద్ద ఎత్తున జాతీయ నాయకత్వం రంగంలోకి దిగాలని కాంగ్రెసు నేతలు కోరుకుంటున్నారు. అయితే అక్కడ వారికి వున్న సీట్ల సంఖ్య సున్నానే. వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువే. అదే తెలంగాణలో అధికారానికి వచ్చే అవకాశం వుందని ఆశపడుతున్నారు. కేంద్ర నాయకత్వం కూడా వారికి అండదండలు ఇస్తుంటుంది. కనుక ఒక పరిధిమించి తెలంగాణ వ్యతిరేక సంకేతాలిస్తే ఆ అవకాశాలు కూడా కరువై పోతాయని అధిష్టానం ఆందోళనగా వుంది.కనుకనే ఎపిసిసిని హద్దుల్లోనే మాట్లాడవలసిందిగా నిర్దేశిస్తున్నది. తెలంగాణలో లాభం కోసం మమ్ములను బలి చేస్తారా అని ఎపిసిసి వాపోతున్నది. ఇది మారే అవకాశం కూడా లేదు. పైగా గుజరాతు ఎన్నికల ఫలితాల తర్వాత తమ వాళ్లు అటూ ఇటూ చెల్లాచెదురై పోవచ్చని కూడా ఎపిసిసి నేతలు వూహిస్తున్నారు.