అమరావతి రైతులు ఢిల్లీలో కేంద్రమంత్రుల్ని ఇతర ముఖ్య నేతల్ని కలిసి ఏపీ ప్రభుత్వం.. సీఎం జగన్ తమకు చేస్తున్న అన్యాయాన్ని వివరించి… మద్దతు కోరుతున్నారు. అయితే అక్కడ కేంద్రమంత్రులను కలవడానికి అమరావతి రైతులకు ఎవరు సాయం చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ నేతలు సహకరిస్తారు . అంత వరకూ బాగానే ఉంది. అయితే వారు చెబితే కేంద్రమంత్రులు అపాయింట్మెంట్లు ఇస్తారా అన్నది చర్చనీయాంశమైన విషయం. అమరావతిలో భూములు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల భవనాలను నిర్మించాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు వినతి పత్రాలు ఇచ్చారు.
అదే సమయంలో సీఎం జగన్ ఢిల్లీకి రావడం.. అమరావతి రైతులు ఆందోళనలు చేసే అవకాశం లేకపోయినా … సీఎం ఇంటిని ముట్టడిస్తారని.. ఆయన ఇంటి చుట్టూ భద్రతను పెంచారు. దాన్ని కొన్ని మీడియాలు హైలెట్ చేశారు. ఇది కావాలని చేశారో .. మరో కారణం ఉందో కానీ పట్టు మని ఇరవై మంది కూడా ఢిల్లీలో లేని అమరావతి రైతులు ఆందోళన చేస్తారని వంద మందికిపైగా పోలీసులతో భద్రత ఏర్పాటు చేయడంతో.. అమరావతి రైతుల అంశం అక్కడా చర్చనీయాంశం అయింది.
ఇక ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అమరావతికి మద్దతుగా చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. శరద్ పవార్‌కు వైఎస్ జగన్ అంటే మొదటి నుంచి ఇష్టం ఉండదు. గతంలో ఓ సారి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన జగన్‌ను కసురుకున్న వీడియో ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటుంది. ఈ సారి కూడా జగన్ పాలనా నిర్ణయాలపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమరావతిని నిర్వీర్యం చేసి ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రకు రెండు రాజధానులు ఉన్నాయని గుర్తు చేసి.. అభివృద్ధికి రాజధానులు కారణం కాదన్నారు.
మొత్తంగా అమరావతి రైతులు.. ఢిల్లీలోనూ రాజధాని అంశాన్ని చర్చకు పెట్టగలిగారు. దీని వెనుక టీడీపీ ఉందా.. బీజేపీ ఉందా అన్న విషయాన్ని పక్కన పెడితే.. తమకు జగన్ సర్కార్ చేస్తున్న అన్యాయంతో పాటు.. ఏపీకి జరుగుతున్న నష్టాన్ని కూడా వివరించడంలో సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు.