ఈ వారం ఢిల్లీలో ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించిన చాలా అంశాలు చర్చకు వచ్చాయి. టిడిపి వైసీపీ కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులూ ప్రత్యేక హౌదా సాధన సమితి, ఎస్ఎప్ఐ తదితర విద్యార్థి సంఘాల నాయకులూ సిపిఐ వారూ వేర్వేరు సందర్బాల్లో కేంద్ర మంత్రులను కలిసి మాట్లాడారు. ఎపిని ఆదుకుంటామని వారు చెప్పినట్టే వుంది గాని ఏ విషయంలోనూ నిర్దిష్టత లేదు. పైపై హామీలుగానే వున్నాయి. కడపలో ఉక్కు కర్మాగారం గురించి ఒప్పుకున్నారని ఒక వార్త. అధ్యయనం చేశాకే చెబుతామని వారన్నారు. పోలవరంకు సహాయం చేస్తామన్నారని ఇంకో కథనం. చట్టప్రకారం ఇవ్వాల్సిన సహాయం మాత్రం ఇస్తామని చాలా ఖచ్చితంగా చెప్పారు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ. 2017 మార్చిలో చేసిన కేంద్ర మంత్రివర్గ తీర్మానం ప్రకారం పోలవరం పూర్తిగా కేంద్రం చెప్పుచేతల్లోనే వుంటుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అందుకు ఆధ్వర్యం వహిస్తుంది. వారి తరపునే రాష్ట్ర ప్రభుత్వం పనులు చేస్తుంది. అయితే చేసిన వాటికి ఖర్చులను కేంద్రం సంతృప్తి చెందిన తర్వాతనే విడుదల చేస్తుందని ఆ తీర్మానంలో వుంది. ఇప్పుడూ జైట్లీ అదే చెబుతున్నారు గాని టిడిపి అంటున్న ఔదార్యం అందులో లేదు. ఇక విశాఖ రైల్వేజోన్ విషయమైనా అదే పరిస్థితి. జోన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని గాక సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని మాత్రమే కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ సమాధానమిస్తున్నారు. విభజన చట్టంలోని 13లోని 8వ అంశంగా వున్న జోన్ విషయం అడిగితే మంత్రి డొంక తిరుగుడు సమాధానమే ఇచ్చారని ఆ ప్రశ్న వేసిన ఎంపి విజయసాయి రెడ్డి వెల్లడించారు. .బాగానే వుంది గాని ఇందుకు కేంద్రాన్ని విమర్శించగల స్థితిలో పాలక ప్రతిపక్షాలు రెండూ లేకపోవడమే విచారకరమైన వాస్తవం.