ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల కారణంగా పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టాలని ఈసీ సూచించింది. వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయించవద్దని ఈసీ సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఈసీ తెలిపింది. ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసేవరకు వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్, మొబైల్ డిపాజిట్ చేయాలని తమ ఆదేశాలలో ఈసీ స్పష్టం చేసింది.
వాలంటీర్ల చేతుల్లో ప్రధానంగా ఉండే ఆయుధం డేటా. ప్రతి యాభై కుటుంబాల డేటా వారి దగ్గర ఉంటుంది. ఓటింగ్ సమయంలో వారు బెదిరిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈసీ వారి వద్ద ఉన్న ఫోన్లు, ట్యాబ్లు కూడా తీసుకోవాలని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎస్ఈసీ ఇలాంటి ఆదేశాలు ఇస్తే..పాటించడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. యథేచ్చగా అక్రమాలు చేశారు. వాలంటీర్లు.. ఇప్పుడు తమ యాభై ఇళ్ల సమాచారాన్ని తస్కరించి వేరే గ్రూపులు ఏర్పాటు చేస్తే అది నేరం అవుతుంది.
పించన్ల పంపిణీని అధికారులు చేపట్టనున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పించన్ల పంపిణీ చేపట్టే అవకాశం ఉంది. వైసీపీ వాలంటర్లపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. పించన్లు వారే ఇస్తారు కాబట్టి.. వారి ద్వారా వృద్ధులను బ్లాక్ మెయిల్ చేయాలని అనుకుంది. కానీ ఇప్పుడు ఆ అవకాశం రివర్స్ అయినట్లే కనిపిస్తోంది.