రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే ఆయన ఎన్నికల ప్రచారంలో పనౌతీ అన్నారట. ఎవరిని అన్నారంటే.. నేరుగా ఎవరినీ అనలేదు.. పరోక్షంగా ప్రధాని మోదీని అన్నారు. ప్రధాని మోదీని పట్టుకుని అంత మాట అంటారా అని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. అంత కంటే బూతు మాటలు ఇంత వరకూ ఎన్నికల ప్రచారం లో ఎవరూ వాడలేదన్నట్లుగా ఈసీ రాహుల్కు నోటీసులు జారీ చేసింది. సమాధానం ఎలా ఇచ్చినా… ఆయనపై ప్రచారం చేయకుండా నిషేధం విధించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మన పోల్ బాడీ నిజాయితీని ఎవరూ శంకించలేరు.
ఇంతకీ పనౌతీ అంటే ఏమిటి ?. ఈ పదంపై బీజేపీ కార్యకర్తలు ఎందుకు అంత ఉలిక్కి పడ్డారు? . పనౌతీ అంటే… హిందీలో అపశకునపు పక్షి, శని, దరిద్ర పాదం ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. అంటే.. ఏదైనా పని సజావుగా సాగుతున్న సమయంలో ఎవరైనా వస్తే… ఆ పని చెడితే అతన్ని పనౌతీ అని సంబోధిస్తారు. తెలుగులో ఐరన్ లెగ్ అని చెప్పుకున్నట్లుగా.. ఇటీవల ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ప్రధాని మోదీ స్టేడియంకు వెళ్లిన సందర్భాన్ని పురస్కరించుకుని రాహుల్ ఈ వ్యాఖ్య చేశారు. మనం కప్ గెలిచే వాళ్లమేనని ఓ పనౌతి వెళ్లడం వల్ల ఓడిపోయామని వెటకారం చేశారు. దీనిపై బీజేపీ నేతలు భగ్గుమటున్నారు.
దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉంటాయి. కానీ అదేమీ లేదన్నట్లుగా రాహుల్ మోదీని.. పనౌతీ అంటారా అని బీజేపీ నేతలు దాన్నే అతి పెద్ద సమస్యగా మార్చేశారు. నేషనల్ మీడియా అంతా బీజేపీ సపోర్టే కాబట్టి.. చర్చలు కూడా విస్తృతంగా నిర్వహించారు. వీటిని చూసి.. జనం కూడా అయ్యో మోదీ అనుకోవాల్సి వస్తోంది.