ఢిల్లీలోని సీఈసీ సునీల్ అరోరాని కలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు, ఎన్నికల సంఘం వైఫల్యం, ఈవీఎంల పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీ టీడీపీకి లేఖ రాసింది. ఈవీఎంల పనితీరుపై సాంకేతికంగా ఉన్న అనుమానాలను చర్చించేందుకు నిపుణులతో ఈనెల 15న మరోసారి కలవొచ్చని లేఖలో స్పష్టం చేసింది. అయితే, టీడీపీ తరఫున హరిప్రసాద్ చర్చల్లో పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనపై కేసు ఉందనీ, ఆయనకి బదులుగా వేరెవరైనా చర్చలకు రావొచ్చని పేర్కొంది.
శనివారం ఉదయం సునీల్ ఆరోరాను చంద్రబాబు కలిసినవారిలో హరిప్రసాద్ ఉన్నారు. ఈవీఎంలను ఏవిధంగా టేంపర్ చెయ్యొచ్చు, చిప్ ని ఎలా మార్చొచ్చు అనే అంశాన్ని సునీల్ అరొరాకు ఆయన వివరించే ప్రయత్నం చేశారు. అయితే, ఈ అంశాలను టెక్నికల్ టీమ్ తో చర్చించండి అంటూ సాయంత్రం 4 గంటలకి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈవీఎంలకు ఇన్ ఛార్జ్ గా ఉన్న సుదీప్ జైన్, ఢిల్లీకి చెందిన మరో ఐఐటీ నిపుణుడితో ఈ సమావేశం జరిగింది. అయితే, టీడీపీ తరఫున హరిప్రసాద్ వచ్చేసరికి… ఆయనతో మాట్లాడేది లేదంటూ ఆ ఇద్దరూ వెళ్లిపోవడం విశేషం. కారణం ఏంటంటే… గుజరాత్ లో ఆయనపై ఒక కేసు ఉందని. ఆ తరువాత, టీడీపీకి సోమవారం రమ్మంటూ తాజా లేఖ రాశారు.
ఈ లేఖపై టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ ఢిల్లీలో మాట్లాడుతూ… హరిప్రసాద్ సాంకేతిక నిపుణుడనీ, ఆయనతో చర్చించడానికి వారెందుకు భయపడుతున్నారన్నారు. ఆయన మీద కేసు ఉందని మాట్లాడేది లేదనడం సరికాదన్నారు. ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయని గతంలో హరిప్రసాద్ నిరూపించారనీ, అయితే దాని నిరూపణకు వాడిన ఈవీఎం ఎక్కడి నుంచి వచ్చిందని మాత్రమే ఆయనపై కేసు ఉందన్నారు. అవినీతి కేసుల్లో ఎ-1, ఎ-2లుగా ఉన్నవారికి ఒక రూలు… ఒక అడ్వైజర్ గా ఉన్నవారికి మరొక రూలా అని జూపూడి ప్రశ్నించారు. హరిప్రసాద్ మీదున్నది మర్డర్ కేసు కాదనీ, దేశాన్ని దోచుకున్న కేసు అంతకన్నా కాదన్నారు. సాంకేతికంగా తమని ఎన్నికల సంఘం ఎందుకు ఎదుర్కోవడం లేదన్నారు. పక్షపాత ధోరణితో వారు వ్యవహరిస్తున్నారనడానికి ఇది మరొక సాక్ష్యం అన్నారు.