ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కనీసం లక్ష కోట్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతుంటారు. కేంద్రప్రభుత్వం నుండి అంత సొమ్ము ఆశించకపోయినా అందులో సగమైన ఇవ్వాలని కోరుకొంటున్నారు. కానీ ఏడాది క్రితం కేంద్రప్రభుత్వం లెక్కలు కట్టి అమరావతి నిర్మాణానికి సుమారు రూ.22,000 కోట్లు సరిపోతుందన్నట్లు చెప్పింది. అంటే అంతమొత్తం ఇవ్వబోతోందని అందరూ భావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అది సరిపోదని భావించడంతో స్విస్ ఛాలెంజ్ పద్దతిలో రాజధాని నిర్మించడానికి సిద్దమవుతున్నారు. అయినప్పటికీ, విభజన చట్టంలో రాజధాని నిర్మాణానికి కేంద్రం విధిగా సహాయం చేస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ఉంది కనుక అది అంచనా వేసిన సొమ్మయినా విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేంద్రప్రభుత్వాన్ని కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు చైనా పర్యటన ముగించుకొని తిరిగివస్తూ డిల్లీలో కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసినప్పుడు రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు మాత్రమే ఇవ్వగలమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ అంతే సిఫారసు చేసిందని చెప్పినట్లు తెలుస్తోంది. గత ఏడాది రూ.22,000 కోట్లు ఇస్తామన్నట్లు మాట్లాడిన ఆర్ధికమంత్రి జైట్లీ ఇప్పుడు దానిలో పదో వంతు మాత్రమే ఇస్తామని చెప్పడం పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. విజయవాడ, గుంటూరులో మురుగునీటి వ్యవస్తలని ఆధునీకరించడానికి కేంద్రప్రభుత్వం విడుదల చేసిన రూ.1,000 కోట్లను ఆ పద్దులో కలపకుండా మినహాయించి రూ.2500 కోట్లు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు అనుకొన్న విధంగానే రాజధాని నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు మొదట చాలా భారీ అంచనాలు ప్రకటించేసి, భాజపా మిత్రపక్షం గనుక కేంద్రం తను అడిగినంతా మంజూరు చేసేస్తుందని భావించినట్లున్నారు. లేదా రూపాయి అవసరముంటే వంద రూపాయలు అడిగితేనే ఆ రూపాయైన విదిలిస్తుందనే ఉద్దేశ్యంతో అడిగి ఉండవచ్చు. చివరికి ఆయన ఊహించినట్లే లక్ష కోట్లు అడిగితే రూ.2500 కోట్లు ఇస్తానని తేల్చిచెప్పింది. గుజరాత్, ఛత్తీస్ ఘర్ తదితర రాష్ట్రాలు 10-15,000 కోట్ల బడ్జెట్ తోనే రాజధానులు నిర్మించుకోగలిగినప్పుడు, అమరావతికి అంత సొమ్ము ఎందుకని రాష్ట్ర భాజపా నేతలు చాలా ప్రశ్నించారు. వాటికి రూ.10-15000 కోట్లు అవసరమైనప్పుడు అమరావతి రూ.2500 కోట్లు ఏవిధంగా సరిపోతాయని కేంద్రం భావిస్తోంది అని ఇప్పుడు ప్రజలు, తెదేపా నేతలు కూడా వారిని తిరిగి ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడింది.