అమరావతి పనుల ప్రారంభోత్సవానికి నిధుల కొరత తీరిపోయింది. ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ రుణాలు మంజూరయ్యాయి. వీటి బాధ్యత కేంద్రానిదే. అందుకే కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఇరవై ఐదు శాతం అడ్వాన్సుగా ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. పనుల ప్రారంభానికి ఇవి కీలకమని విజ్ఞప్తి చేయడంతో ఆ మేరకు నిధులు విడుదల చేసింది. కేంద్రం కూడా తన వాటాగా 750 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. మొత్తంగా 4200 కోట్లకుపైగా అమరావతి ఖాతాకు జమ అయ్యాయి.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 40వేల కోట్ల రూపాయలకుపైగా విలువైన పనులకు టెండర్లు ఖరారు చేసింది. వారికి పనులు అప్పగించింది. వారంతా పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యంత్రాలను తెచ్చుకుంటున్నారు. గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ నెలలో ప్రధాని మోదీ అమరావతిలో పర్యటించి పనులను రీస్టార్ట్ చేయనున్నారు. అంతకు ముందు నిధులను విడుదల చేశారు.
గతంలో కూడా మోదీనే శంకుస్థాపన చేశారు. అప్పట్లో నిధులు మంజూరు చేయలేదు. కానీ ఇప్పుడు మోదీ రాక ముందే నిధులు అమరావతి ఖాతాలో జమ చేశారు. ఈ సారి పనులు ఆగే అవకాశాలు కనిపించడం లేదు. రెండేళ్లలో అమరావతికి ఓ రూపం వచ్చే చాన్సులు కనిపిస్తున్నాయి.