ఏపీ పోలీసులకు ప్రధాని కూడా డోంట్ కేర్. ఆయన భద్రత కూడా పట్టదు. అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదం. గల్లీ లీడర్ ఏం చెప్పినా అదే చేస్తూంటారు. ప్రధాని భద్రత విషయంలోనూ అలాంటి పనులే చేయడంతో చాలా మంది పోలీసులు కేంద్ర హోంశాఖ ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఈ నెల మొదట్లో విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ జోన్ గా ఆయన రోడ్ షో నిర్వహించే ప్రాంతాన్ని ప్రకటించారు. అక్కడ డ్రోన్లు లాంటివి ఏమీ ఎగరవేయకూడు. కానీ ఆయన రావడానికి అరగంట ముందు డ్రోన్లు ఎగిరాయి. దీంతో ఎస్పీజీ సిబ్బంది వాటి సిగ్నల్స్ ని కంట్రోల్ చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ డ్రోన్ ఎవరిదా అని ఆరా తీస్తే ఏపీ పోలీసులదే అని తేలింది. అప్పుడే హెచ్చరించినా… మళ్లీ రోడ్ షో ముగిసే సమయానికి మరో డ్రోన్ గాల్లోకి ఎగిరింది. దీంతో ఎస్పీజీ సిబ్బంది కంగారు పడ్డారు. చివరికి ఆ డ్రోన్ కూడా ఏపీ పోలీసులదే అని తేలింది.
తమ మార్గదర్శకాలు పట్టించుకోకుండా… పూర్తి స్థాయిలో చేసిన భద్రతా ఉల్లంఘనగా తేల్చి ఎస్పీజీ గ్రూప్ కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చింది. కేంద్ర హోంశాఖ ప్రధాని మోదీ సెక్యూరిటీలోనే ఉల్లంఘనకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రధాని మోదీ సెక్యూరిటీని పలువురు ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తారు. వారందరికీ ఇప్పుడు మూడినట్లేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. అసలు డ్రోన్లు ఎందుకు ఎగురవేశారంటే… జనాలు ఎవరూ లేరని చూపించడానికి.. సాక్షికి దృశ్యాలు ఇవ్వడానికన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఐదేళ్లుగా పోలీసులు ఇలాంటి పనులే చేస్తున్నారు మరి !