డిసెంబర్ లో లోక్ సభకూ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ.. విస్తృతంగా జరుగుతున్న ప్రచారానికి బలం ఇచ్చేలా వరుసగా ఒక దాని తర్వాత ఒకటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఇటీవలే వర్షాకాల సమావేశాలు ముగిశాయి. విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే .. చర్చ కూడా జరిగింది. ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమవుతోంది.
డిసెంబర్ లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. మళ్లీ ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిషా రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇలా వరుసగా ఎన్నికలు జరుగుతూండటంతో ప్రజాధనం వృధా అవుతోందని.. మొత్తం తొమ్మిది రాష్ట్రాలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఒకే సారి నిర్వహించాలన్న ఆలోచనకు కేంద్రం వస్తోందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడానికే పార్లమెంట్ సెషన్ నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు రాష్ట్రాల్లో తుది ఓటర్ల జాబితాను ఫైనల్ చేయడానికి ప్రయత్నిస్తోంది.
ఏపీ, ఒడిషాల్లో కూడా రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా నియమించారు. మొత్తంగా కేంద్రం… నిర్ణయం తీసుకుంటే అధికారింగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. డిసెంబర్ లేదా జనవరి మొదటి వారంలో పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.