తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభమైన జల జగడం.. కేంద్రానిదే తప్పంటూ.. కేసీఆర్ చేస్తున్న వాదనతో.. ఢిల్లీ సర్కార్ అప్రమత్తమయినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ప్రాజెక్టుల డీపీఆర్లు మాత్రమే అడిగేది. అయితే.. తాజాగా.. తెలంగాణ సర్కార్ ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చును కూడా అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ప్రభుత్వాలు పెట్టే ఖర్చుల గురించి కేంద్రం అడగదు. కానీ.. ఇప్పుడు… జలజగడాన్ని ఆసరా తీసుకుని లెక్కలన్నీ బయటకు లాగాలనుకుంటోంది. ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. బీజేపీ కొంత కాలంగా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో.. కేంద్రం.. కొత్తగా ఖర్చులు అడగడం.. ఆసక్తి రేపుతోంది.
ప్రాజెక్టులకు మొదట్లో ఖరారు చేసిన ధరలు, తర్వాత పెంచినవి, వాటిలో ఎన్ని పూర్తి చేశారు, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? వంటి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా అడిగినట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులే కాకుండా..ప్రభుత్వం చేపట్టిన.. చిన్న చిన్న ప్రాజెక్టుల లెక్కలు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తంగా 33 ప్రాజెక్టుల వివరాలు.. వాటికి మొదటి అంచనాలు.. తర్వాత పెంచినవి.. చెల్లించినవి.. పెట్టిన ఖర్చు, పూర్తి చేసిన ప్రాజెక్టుల వివరాలు, వాటి కింద అందుబాటులోకి వచ్చిన ఆయకట్టు, ఇంకా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల వంటి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ లేఖ వచ్చినట్లుగా చెబుతున్నారు.
సాధారణంగా అనుమతుల కోసం ప్రభుత్వాలు… డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను సమర్పించాలి. ప్రాజెక్టులను చేపట్టి, వాటిని కొంత మేర పూర్తి చేసిన తర్వాత మళ్లీ సమాచారం అడగడం అరుదుగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్న ప్రాజెక్టులకు అయితే సమాచారాన్ని పంపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేంద్రం సహాయం చేయని ప్రాజెక్టుల సమాచారాన్ని కూడా కోరుతోంది. అంటే.. కేంద్రం .. జల వివాదాన్ని తమకు అంటించాలనుకుంటున్న తెలంగాణ సర్కార్ పెద్దలకు…ప్రాజెక్టుల్లో ఖర్చుల అవకతవకలు వెలుగులోకి తెచ్చి..షాక్ ఇవ్వాలనుకుంటోందన్న చర్చ రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది.