ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం నుంచి సాధించి తీరతామనీ, అన్ని మార్గాల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామనీ, ఏపీకి రావాల్సినవి వచ్చే వరకూ ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారీ అడుగుతూనే ఉంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పారు. దానికి అనుగుణంగా వైకాపా ఎంపీలు కూడా పార్లమెంటులో భాజపా సర్కారును పదేపదే ప్రశ్నిస్తామనీ చెప్పారు, ప్రశ్నిస్తున్నారు కూడా! కానీ, కేంద్రం వైఖరి ఏంటనేది ఎప్పటికప్పుడు స్పష్టమౌతూనే ఉంది. వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి పార్లమెంటులో మాట్లాడుతూ… విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కేంద్రానికి తెలిసిందేననీ, గడచిన ఐదేళ్లుగా పారిశ్రామికాభివృద్ధి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీంతో నిరుద్యోగ సమస్య పెరుగుతోందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో పార్లమెంటులో ప్రధాని ప్రకటించారని గుర్తుచేశారు. రాష్ట్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏపీకి ప్రత్యేక పన్నుల రాయితీ ఇవ్వాలని కోరారు.
దీనిపై స్పందించిన నితిన్ గట్కరీ… దేశంలో అన్ని రాష్ట్రాలకూ ఎలాంటి రూల్స్ వర్తిస్తాయో ఆంధ్రాకీ అవే వర్తిస్తాయన్నారు. ఒక రాష్ట్రం కోసం ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వడం, పథకాలు రూపొందించడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యమయ్యేది కాదని స్పష్టం చేశారు. జీఎస్టీలో రాయితీ ఇవ్వడం అనేది అసాధ్యమని చెప్పారు. అయితే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్నారు గట్కరీ. ఇప్పుడున్న కేంద్ర పథకాల్లోనే ఏపీకి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇప్పుడు కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు లోబడి ఎన్ని ప్రతిపాదనలు పంపించినా, వెంటనే స్పందిస్తామన్నారు. నిరుద్యోగం తగ్గించడం కోసం, గ్రోత్ రేట్ పెంచడం కోసం పూర్తి సాయం చేస్తామన్నారు.
ఉన్న పథకాలూ స్కీములతో ఆంధ్రా సమస్యలు తీరిపోతాయంటే… ప్రత్యేకంగా ఇవ్వాలని ఎవరైనా ఎందుకు అడుగుతారు? ఒకవేళ ఏపీకి ప్రత్యేకమైన కేంద్ర సాయం అవసరం లేదనుకుంటే… విభజన చట్టంలో అన్ని రకాల ప్రయోజనాలు ఎందుకు పెడతారు? ఏపీ సమస్యలను కేంద్రం ఏమాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదని చెప్పడానికి గట్కరీ స్పందన మరో ఉదాహరణ. ఆంధ్రాని ఇతర రాష్ట్రాలతో సమానంగానే కేంద్రం చూస్తోంది. విభజన తరువాత సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రంగా పరిగణించడం లేదు. ఈ వైఖరిపై వైకాపా ఎంపీలు స్వరం పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏపీ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా కార్యాచరణ వీలైనంత వేగంగా రూపొందించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.