ఎర్రచందనం విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లుగా కనిపిస్ోతంది. గత ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపారని.. కానీ ఇప్పుడు విచ్చలవిడిగా జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తేల్చేశారు. అక్రమ ఎర్రచందనం రవాణాను అరికట్టడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని తాను ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలిపారు. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చిన కిషన్ రెడ్డి.. ప్రత్యేకంగా ఎర్రచందనం చెట్టు నాటే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా.. భారతీయ జనతా పార్టీ నేతలు.. ఏపీలో ఎర్ర చందనం అక్రమ రవాణా గురించి కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. ఈ ఫిర్యాదుల క్రమంలో హోంశాఖ సహాయమంత్రి హోదాలో ఏపీ సర్కార్కు లేఖ కూడా రాశారు. పెద్ద ఎ్తతున ఎర్రచందనం తరలి పోతోందని… స్మగ్లింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇప్పుడు తిరుమలకు వచ్చి గతంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని … ఇప్పుడు తీసుకోవడం లేదని నేరుగా చెప్పడం సంచలనంగా మారింది.
ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కేంద్ర తరుపున చర్యలు తీసుకోవడంతో పాటు రాష్ట్రానికీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కిషన్ రెడ్డి చెబుతున్నారు. ఎర్రచందనాన్ని జాతీయ సంపదగా గుర్తించి కాపాడుకోవాల్సి ఉందన్నారు. గతంలో స్మగ్లర్లు రోజూ దొరికేవారు. కానీ ఇప్పుడు.. అసలు దొరకడం లేదు. ఏదైనా ప్రమాదాలు జరిగి వారికి వారు పట్టుబడాల్సిందే తప్ప.. పోలీసులు పట్టుకోవడం లేదు. కేంద్రమే ఈ విషయంలో ఏదో ఓ యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచనతోనే కిషన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.