కేంద్రం నుంచి నిధులు సాధించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెయిలయింది అనే మాట ఎవరైనా అంటే చాలు.. చంద్రబాబునాయుడు ఇంతెత్తున లేస్తారు. ఏపీ భాజపా నాయకులు విరుచుకుపడిపోతారు. ఏ పద్దుల కింద ఎంతెంతో చెప్పలేరు గానీ.. లక్షల కోట్లు ఏపీకి ఇచ్చేశాం.. అంటూ భాజపా నాయకులు భాష్యాలు వెతుకుతారు. బడ్జెట్లో కనిపించకపోవచ్చు గానీ.. ‘రాష్ట్రానికి రావలసినదానికంటె కేంద్రంనుంచి ఎక్కువగానే సాధించుకు వస్తున్నాం..’ ‘గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ద్రోహం చేసింది’ అనే పడికట్టు పదాలను పేర్చిపేర్చి.. జనాన్ని కొత్తగా ఎలా బురిడీ కొట్టించాలో చంద్రబాబునాయుడు ప్రసంగాలు తయారుచేసుకుంటారు. కానీ గురువారం నాటి రైల్వే బడ్జెట్లో చాలా స్పష్టంగా తేలిపోయింది. ఈ రైల్వే బడ్జెట్లో తెలంగాణకే ఏపీకంటె ఎక్కువ కేటాయింపులు లభించాయి. ప్రాథమికంగా తెలుస్తున్న వివరాలను బట్టి తెలంగాణ లోని వివిధ మార్గాలకు కేటాయించిన నిధుల మొత్తం 400 కోట్లు కాగా, ఏపీలో రెండే పనులకు ప్రకటించింది 250 కోట్లు మాత్రమే.
ఇక్కడ మరొక అంశాన్ని కూడా కీలకంగా గమనించాల్సి ఉంది. తెలంగాణలో మొత్తం 8 ప్రాజెక్టులకు సంబంధించి ఈ 400 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 8 చోట్ల పనులు ఏదో ఒక రీతిగా మొదలై జరుగుతూ ఉంటాయన్నమాట. వీటిలో ఆరు రైల్వేలైన్ల పనులు కాగా, ఒకటి ఓవర్ బ్రిడ్డి, మరొకటి సబ్ వే పనులు. పది జిల్లాల రాష్ట్రంలో 8 చోట్ల రైల్వేకు సంబంధించిన విస్తరణ అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. మొత్తం 250 కోట్లు కేటాయించింది రెండు పనులకే. కోటిపల్లి- నర్సాపురానికి 200 కోట్లు, పిఠాపురం- కాకినాడకు 50 కోట్లు ఇచ్చారు. ఆ పనుల్లో జాప్యం జరిగితే.. ఇక ఈ కేటాయింపులు అంతే సంగతులు. ఇప్పుడు చూసుకుని మురిసిపోయి.. మళ్లీ వచ్చే బడ్జెట్లో చకోర పక్షిలా ఎదురుచూడాల్సిందే.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోలిక తేవడం ఎందుకంటే.. ఈ రెండూ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు. అవసరాలు, రైల్వే శాఖ మద్దతు పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్త ‘నీడ్’ ఉన్న స్థితిలో ఉంది. అయితే ఆ రాష్ట్ర అవసరాలను నామమాత్రంగా కూడా పట్టించుకోకుండా.. ఏపీ అనే కొత్త రాష్ట్రం రైల్వే పరంగా కోటి ఆశలతో నిరీక్షిస్తున్నదనే స్పృహే లేదన్నట్లుగా బడ్జెట్ను ప్రతిపాదించడం సురేశ్ప్రభుకే చెల్లింది.