దేశ ప్రజలు పెట్రోల్, డీజిల్‌లకు పన్ను రూపంలో పెద్ద మొత్తంలో తమ ఆదాయాన్ని కడుతున్నారు. ఇది తాము కట్టే ఆదాయపు పన్నుకు అదనం. ఇతర జీఎస్టీలకు అదనం. ఆదాయపు పన్ను, జీఎస్టీలు కాకుండా.. పెట్రోల్, డీజిల్‌పై దేశ ప్రజలు పది నెలల్లో రూ. మూడు లక్షల కోట్ల వరకూ పన్నులు చెల్లించారు. ఇది అచ్చంగా కేంద్రానికి వచ్చిన ఆదాయం. అంతే కాదు.. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాలు వేసే వ్యాట్ దీనికి అదనం. కొన్ని రాష్ట్రాలు వ్యాట్‌కు తోడు.. లీటర్ పెట్రోల్‌పై రూ. నాలుగు వరకూ అదనపు పన్ను వసూలు చేస్తున్నాయి. ఇలాంటివన్నీ కలుపుకుంటే.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి.. రూ. ఐదు లక్షల కోట్ల వరకూ.. ప్రజల వద్ద నుంచి పదినెలల్లో వసూలు చేశారని అర్థం చేసుకోవచ్చు.
కేంద్రం అధికారికంగా తెలిపిన సమాచరం ప్రకారం… పది నెలల్లో రూ. రెండు లక్షల 94వేల కోట్ల పెట్రో పన్ను వసూలు చేసుకుంది. ఒక్క లీటర్ పెట్రోల్‌పై రూ. 32.90 పన్ను కేంద్రం వసూలు చేస్తోంది. డీజిల్‌పై రూ.31.80 పన్ను వసూలు చేస్తోంది. అంటే… ఒక్క లీటర్‌కు వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొంటే అందులో రూ.33 వరకూ కేంద్రం పన్నులు. ఇందులో సెస్సులు అదనం. రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ అదనం. వారు వేసే అదనపు పన్నులు ఎక్స్ట్రా. ఇవన్నీ చూస్తే.. అసలు లీటర్ పెట్రోల్ ధర… రూ. 30 కూడా ఉండదు. అన్నీ ప్రభుత్వాలు ఇంతే వసూలు చేయలేదు. ఒక్క బీజేపీ సర్కారే ఈ తాట తీసేంత వసూళ్లు చేస్తోంది.
2014-15లో పెట్రో పన్ను ద్వారా కేంద్రానికి వచ్చింది రూ. 70వేల కోట్లకు అటూ ఇటుగా..ఈ ఆర్థిక సంవత్సరం పది నెలల్లో వచ్చింది రూ. 2.94 లక్షల కోట్లు . కేంద్రం అధికారికంగా ఈ లెక్కలను విడుదల చేసింది. కాంగ్రెస్ హయాంలో పెట్రోల్‌పై ఎక్సైజ్ పన్ను తొమ్మిది రపాయలు ఉండేది. డీజిల్‌పై రూ. మూడున్నర ఉండేది. ఇప్పుడు అది ముఫ్పై రూపాయలు దాటించేశారు. ఈ లెక్కన పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 53 శాతం పన్నుల వాటానే ఉంటోంది. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా కష్టాలు పడుతున్నా.. వారి ఆదాయం పెంపు కోసం ఎలాంటిప్రయత్నాలు చేయని ప్రభుత్వం పెట్రో పన్నులు మాత్రం ఆత్మనిర్భర్ పేరుతో భారీగా వడ్డించింది.