కేంద్రంపై కేసీఆర్ బహిరంగంగా యుద్ధం ప్రకటించి.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దమ్ముంటే చూసుకుందామని మీసాలు మెలెస్తున్నంత పని చేస్తున్నారు . కానీ కేంద్రం మాత్రం సైలెంట్ గా తాను చేయాల్సిన యుద్ధాన్ని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇంత కాలం కాళేశవరం ప్రాజెక్టుపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పెద్దగా పట్టించుకోని కేంద్రం.. ఇటీవల మాత్రం దూకుడు పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్లకుపైగానే ఖర్చు పెట్టారు. కాంట్రాక్ట్ మేఘా కృష్ణారెడ్డికి దక్కింది.
ఇప్పుడు ఈ కాళేశ్వరం కాంట్రాక్ట్.. ఖర్చు గురించి కాగ్ ఆరా తీస్తోంది. నేరుగా కేంద్ర దర్యాప్తు సంస్థల్ని రంగంలోకి దించకుండా ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టులోని ఖర్చుల గురించి తెలుసుకుంటోంది. కంప్ట్రోలరర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయమే రంగంలోకి దిగింది. కొంత కాలంగా అనేక వివరాలు సేకరిస్తోంది. ఆ మేరకు తెలంగాణ అధికారులు ఇస్తున్న సమాచారం సరిపోలడం లేదని.. నేరుగా కాగ్ ఉన్నతాధికారే ప్రత్యక్షంగా కాగ్ పరిశీలనకు వస్తున్నారు . ఇది రాజకీయంగానూ కలకలం రేపుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కేంద్రంగానే రాజకీయాల్లో డబ్బు వ్యవహారాలు ఉంటున్నాయని కొంత కాలంగా ఆరోపణలు ఉన్నాయి. మేఘా కృష్ణారెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అనేక సార్లు కాళేశ్వరం అవినీతిపై ఆరోపణలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు . ఇప్పుడు సమయం వచ్చిందేమో కానీ.. అందరూ రంగంలోకి దిగుతున్నారు. కాళేశ్వరం లొసుగుల్ని కాగ్ బయటకు లాగితే…. అందులో అసలు అవినీతి కోసం కేంద్ర దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగితే…. రాజకీయం అంతా మారిపోయే అవకాశం ఉంది.