ఈ స్థలం కోర్టులో ఉన్నది. ట్రెస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అనే బోర్డులో కోర్టులో ఉన్న స్థలాల గురించి కనిపిస్తూ ఉంటాయి. ఆ స్థలంపై ఎలాంటి లావాదేవీలు కాదు కదా.. కనీసం అడుగు పెట్టడానికి కూడా అంగీకరించరు. అలాంటిది కేంద్ర ప్రభుత్వమే అలా కోర్టులో ఉన్న స్థలాల్లో ఇళ్లు కట్టుకోవచ్చని మంజూరు చేసింది. ఇలా రాష్ట్రం అడగడం.. అలా మంజూరు చేయడం జరిగిపోయాయి.
అమరావతిలో ఆర్ 5 జోన్ లో ఇళ్ల స్థలాల పంపిణీకి మాత్రమే సుప్రీంకోర్టు అనుమతించింది. అమరావతి విషయంలో తుది తీర్పునకు లోబడి ఆ స్థలాల పంపిణీ ఉంటుందని స్ఫష్టం చేసింది. ఆ ప్రకారమే.. పంపిణీ చేసిన పట్టాలపై… ఈ పట్టాకోర్టు తీర్పు ప్రకారమే చెల్లుతుందని స్టిక్కర్ అంటించి ఇచ్చారు. అంటే వారికి హక్కులు లేవు. ఊరకనే పత్రాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ ఇళ్లు కడతామని..దాదాపుగా నలభై వేల ఇళ్లకు అనుమతి ఇవ్వాలని అడిగిన విజ్ఞప్తికి ఆమోద ముద్ర వేసింది.
అమరావతిలో స్థలం కోర్టులో ఉందని అక్కడ ఇళ్లు కడతామంటే ఇచ్చేది లేదని.. కేంద్రం చెప్పాల్సి ఉంది. చట్టాలను.. పాటించాల్సింది కేంద్రం. కోర్టులో ఉన్న స్థలాల్లో నిర్మాణాలకు అనుమతి ఇస్తే… తర్వాత అది అనేక విపత్తులకు… చట్టఉల్లంఘనలకు కారణం అవుతుంది. కానీ అమరావతి రైతులకు అన్యాయం చేయాల్సిందేనన్న ఒకే ఒక్క లక్ష్యంతో.. దేనికైనా సరే అంటున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఈ రైతుల్ని ఎవరు కాపాడుతారు.. ఈ దేశలో హక్కుల కోసం ఎవరి వద్దకు ఆ రైతులు వెళ్లాలి ?