జగనన్న గోరు ముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ అంటూ .. అంగన్వాడీ పిల్లలకు ఇస్తున్న ఆహారానికి పబ్లిసిటీ చేసుకుంటున్న ఏపీ సీఎం జగన్కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తక్షణం ఆ పథకాల పేర్లను మార్చేయాలని ఆదేశించింది. ఎందుకంటే.. ఆ పథకాలు కేంద్ర పథకాలు. వాటికి కేంద్రం నిధులిస్తోంది. వాటికి ప్రత్యేకంగా కేంద్ర పథకాల కింద నిధులిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం జగన్, వైఎస్ఆర్ పేరు మీద పెట్టిన పథకాలకు ఖర్చు చేస్తోంది. తక్షణం ఆ పేర్లు మార్చాల్సిందేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నుంచి తాఖీదు వచ్చింది.
అంతే కాదు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ ఐసీడీఎస్, ఐసీపీఎస్ పథకాలకు కేంద్రం కేటాయించిన రూ.187 కోట్లు ఇచ్చామని.. ఆ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించాలని లెక్కలు చెప్పాలని ఆదేశించింది. ప్రభుత్వానికి ఈ చిక్కులు తెచ్చి పెట్టింది ఎవరో కాదు.. రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజునే. ఆయన కేంద్రమంత్రికి పథకాల పేర్ల మార్పు.. నిధుల మళ్లింపుపై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఏపీ ప్రభుత్వానికి తాఖీదు పంపారు. లెక్కలు చెప్పాలన్నారు.
ఇప్పటి వరకూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే జగనన్న గోరు ముద్ద.. జగనన్న పాలు.. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పేరుతోనే అమలు చేస్తున్నట్లుగా భారీగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు కేంద్రం ద్వారా రఘురామకృష్ణ రాజు అసలు విషయం బయటకు వచ్చేలా చేశారు. తాము లెక్కలు చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు పంపామని.. రఘురామకృష్ణరాజు స్మృతి ఇరానీ ఆఫీసు నుంచి రిప్లయ్ కూడా వచ్చింది. ఇటీవల ఆ పథకం బిల్లులు కూడా చెల్లించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నిధులన్నీ దారి మళ్లాయో లేదో కూడా ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది.