గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడ్ని అందరూ స్మరించుకుంటున్నారు. సామాన్యుల సంగతేమో కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రచార ఆర్భాటలతో స్మరించుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్వచ్చభారత్ 2 ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వం స్వచ్చ సంకల్పం ప్రారంభిస్తోంది. చెత్త వాహనాలు ప్రారంభించడమే సంకల్పం. కేంద్రం ఎప్పుడో అధికారంలోకి వచ్చిన మొదట్లోనే అంటే 2014లో మహాత్ముడి కళ్ల జోడుని బ్రాండ్‌గా వాడేసి స్వచ్చభారత్ ప్రారంభించింది. ఆ పేరుతో సెస్‌లు వసూలు చేసింది. కానీ నేటికి ఏం సాధించాలో మాత్రం స్పష్టత లేదు. అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పేమీ లేదు. ఇంకా చెప్పాలంటే శుభ్రత పరిస్థితులు దిగజారిపోయాయి.
అయితే స్వచ్చతతో సంబంధం లేకుండా ప్రజలు ఇచ్చే ఓటింగ్ ..మరికొన్ని పారామీటర్స్ ఆధారంగా నగరాలకు ర్యాంకులు ఇవ్వడం మాత్రం చేస్తున్నారు. ఇప్పుడు రెండో విడతలో ఊరు చివరి చెత్తకొండల్ని కరిగించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజానికి సమస్య ఏమిటో గుర్తించకుండా సమరానికి వెళ్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. కానీ అలాంటి ప్రయత్నం కేంద్రం చేయలేదు. రాష్ట్రంలోనూ అంతే. ఏపీలో మున్సిపల్ పాలన ఎంత దారుణంగా ఉందో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. స్వచ్చ సంకల్పం పేరుతో పెద్ద ఎత్తున వాహనాలు కొంటే సరిపోదు… గత స్వచ్చభారత్‌లో ఏంచేశారో అంతకు మించి చేయాల్సి ఉంటుంది.
మహాత్ముడికి దేశం నివాళిగా ఏమిచ్చిందో ఇప్పటికీ స్పష్టత లేదు. ఆయన పేరుతో ఆయనకు ఎంతో ఇష్టమైన స్వచ్చ భారత్‌ను నివాళిగా అర్పించాలంటే చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. ప్రచార ఆర్భాటాలను పక్కన పెట్టాలి. నిజాయితీగా శ్రమించాలి. అప్పుడే ఆయన ఆశయం సాకారం అవుతుంది. కానీ మన నేతలు పావలా పనికి ముప్పావలా ప్రచారం చేసుకోవడం ఎప్పుడూ ఆపరు. కాబట్టి ఆ ఆశ నెరవేరదు.