ఇంధన రంగంలో ఉన్న ప్రభుత్వానికి చెందిన కంపెనీలు.. అంటే ఇండియన్ ఆయిల్, హిందూస్థాన్ పెట్రోలియం లాంటి పెట్రోల్, డీజిల్ అమ్మే కంపెనీలు.. ఇటీవల దేశంలో ఆక్సిజన్ కొరత పరిస్థితిని తీవ్రంగా బాధపడ్డాయి. అందుకే.. వెంటనే.. అందరూ కలిసి సంయుక్తంగా వంద మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటికి నిధులను కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వదు. కంపెనీలే తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద ఉన్న వాటిని ఖర్చు పెడతాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం… సీఎస్ఆర్ ఫండ్ కింద కనీసం రెండు శాతం సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి. అందులో భాగంగా .. ఆక్సిజన్ ప్లాంట్లను పెట్టాలని నిర్ణయించారు. ఇలా ఖర్చు పెట్టినా సీఎస్ఆర్ కిందే ఖర్చు చేసినట్లుగా భావిస్తామని ఇటీవల కేంద్రం స్పష్టం చేసింది.
ఏపీ తీరమే ఆ కంపెనీలకు ఊపిరి..కానీ ఏపీ ప్రజలకు “ఊపిరి” మాత్రం ఇవ్వరు…!
వంద మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాలని నిర్ణయించుకున్న ఆయిల్ పీఎస్‌యూలకు ఎక్కడెక్కడ పెట్టాలో కేంద్రం దిశానిర్దేశం చేసింది. వాటిలో ఒక్కటంటే ఒక్కటీ ఏపీకి లేదు. వంద ప్లాంట్లను కొన్ని రాష్ట్రాల్లో పెట్టాలని డిసైడ్ చేశారు. దాదాపుగా అన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. బీజేపీ పాలిత కాకుండా.. కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో మాత్రమే ఈ పీఎస్‌యూలకు ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టే చాన్స్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు ఒక్కటీ కేటాయించలేదు. ముఖ్యంగా ఏపీకి అసలు కేటాయించలే్దు. నిజానికి ఆయిల్ కంపెనీలు మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాల్సింది ఏపీనే. ఎందుకంటే.. ఆక్సిజన్ అవసరాల సంగతి.. బీజేపీ రాజకీయాల సంగతి పక్కన పెడితే… ఆయిల్ కంపెనీలకు దిగుమతులు కాకుండా ఎక్కువగా ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి చేసి సొమ్ములు సంపాదిస్తోంది ఏపీ నుంచే. కృష్ణా గోదావరి బేసిన్ నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ రిగ్ చేసి.. డబ్బులు సంపాదిస్తోంది. కానీ ఏపీ ప్రజలకు సంక్షోభ సమయంలో కాస్త ఊపిరి ఇవ్వడానికి మనసొప్పలేదు.
సీఎస్ఆర్ నిధులతో వంద ఆక్సిజన్ ప్లాంట్లు..! ఏపీకి ఒక్కటీ లేదు..!
ఆక్సిజన్ కొరతతో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతోంది. డిమాండ్ పెరుగుతోంది. కానీ సప్లయ్ పెరగడం లేదు. ఏపీలో కరోనా కేసులు.. మరణాలు అనూహ్యంగా ఉంటున్నాయి. రికార్డుల్లో ఎక్కనప్పటికీ.. ఏ కాలనీకి వెళ్లినా… కరోనా వల్ల మావాళ్లు చనిపోయారని చెప్పేవాళ్లే కనిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరాల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించలేకపోయింది. కేజీ బేసిన్ లో ఆయిల్ రిగ్ చేసుకుంటూ… ఆదాయం పొందుతున్నా సీఎస్ఆర్ కింద కనీసం ఏపీలో ఒక్క ఆక్సిజన్ ప్లాంట్ పెట్టేందుకు ముందుకు రాకపోయినా అడిగే నాధుడు లేకుండాపోయారు. కనీసం ప్రతిపాదనలు పంపినట్లుగా కూడా లేదు. అందుకే… ఆయిల్ కంపెనీలు లైట్ తీసుకుని ఉంటాయని చెబుతున్నారు.
ప్రభుత్వం అడగదు.. పెట్టదు..! ప్రజలకే దిక్కలేని చావులు..!
ఆయిల్ కంపెనీల నిధులతో పెట్టే ఆక్సిజన్ ప్లాంట్లు .. ఆయిల్ కంపెనీల ఇష్టం. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి కాబట్టి.. ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతారు. కానీ… తాము ఎక్కడ లబ్ది పొందుతున్నామో.. ఆ ప్రాంతానికి మేలు చేయడం అనేది ఎవరైనా చేసే పని. కానీ ఇక్కడ అలా కంపెనీలు చేయడం లేదు.. చేయమని ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదు. ఏపీకి ఒక్క ఆక్సిజన్ ప్లాంట్ పెట్టకపోవడం సర్కార్ కు.. సర్కార్ పెద్దలకు పోయేదేమీ ఉండదు. అలాగే పెట్టకపోవడం వల్ల ఆయిల్ కంపెనీలకు మునిగేదేమీ ఉండదు. కానీ ఇరువురి తప్పిదం వల్ల ఆక్సిజన్ కొరతతో బలయ్యే వారి కుటుంబాలకే నష్టం. వారు ఏపీ ప్రజలు కావడమే వారి దురదృష్టం.