తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ.. హఠాత్తుగా సమావేశమయ్యారు. ఎందుకు సమావేశమయ్యారంటే.. ఎనిమిదో తేదీన కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో.. విభజన సమస్యలపై చర్చలు జరగబోతున్నాయి. సమస్యలను పరిష్కరించే అవకాశం కేంద్రానికి ఇవ్వకుండా…. తెలుగు రాష్ట్రాలే పరిష్కరించేసుకుని… కేంద్రానికి రిలీఫ్ ఇవ్వాలనున్న ఉద్దేశంతో సమావేశం అయ్యారు. మీడియాకు కూడా అదే చెప్పారు. ఉమ్మడి సంస్థల విభజన దగ్గర్నుంచి ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ వరకూ.. అన్ని సమస్యల.. పరిష్కారానికి ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరిగాయని.. త్వరలో పరిష్కారమైపోతాయని చెప్పుకొచ్చారు. ఈ సమావేశం ముగిసి ముగియగానే.. విభజన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని కూడా నియమించింది.
అయితే.. ముఖ్యమంత్రుల సమావేశం జరిగి ఇరవై నాలుగు గంటలకు కాక ముందే.. ఢిల్లీలో విభజన సమస్యలపై జరగాల్సిన సమావేశం వాయిదా వేసేసింది కేంద్ర హోంశాఖ. మళ్లీ ఎప్పుడు జరుగుతాయో చెప్పలేదు. వాయిదాకు కూడా విచిత్రమైన కారణం చెప్పారు.. కేంద్ర హోంశాఖ కార్యదర్శి కొత్తగా వచ్చారని.. ఆయన విభజన అంశాలను అధ్యయనం చేశాక.. ఇరు రాష్ట్రాల అధికారులతో భేటీ ఏర్పాటు చేస్తారని అధికారిక ప్రకటన ఇచ్చారు. నిజానికి ఏ అధికారి బదిలీపై వచ్చినా.. ప్రతీ అంశాన్ని మళ్లీ మొదటి నుంచి ఆయన ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకూ.. జరిగిన పరిణామాలు.. తీసుకోవాల్సిన నిర్ణయాలతో మొత్తం నోట్ రెడీగా ఉంటుంది. కింది స్థాయి అధికారులు చేసే పనే అది. కానీ అనూహ్యంగా అదే కారణం చెప్పి.. సమావేశాన్ని రద్దు చేశారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం రాగానే.. విభజన సమస్యలన్నీ చిటికెలో పరిష్కారమవుతాయన్నట్లుగా హడావుడి చేశారు. హైదరాబాద్లోని ఏపీ భవనాలన్నిటినీ తెలంగాణకు అప్పగించేశారు. ఏపీకి అభ్యంతరాలున్న.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్ వెళ్లారు. కానీ ఏపీకి సంబంధించినంత వరకూ ఒక్కటంటే.. ఒక్క గుడ్ న్యూస్ రాలేదు. ఒక్క విభజన సమస్యకూ పరిష్కారం దొరకలేదు. చివరికి కరెంట్ బకాయిల గురించి కూడా అడగడం లేదు. ఈ క్రమంలో కేంద్రం వద్ద పంచాయతీ తేలుతుందనుకుంటే.. కేంద్రం కూడా.. వాయిదాల బాటనే నమ్ముకుంది.