ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. విభజనతో సర్వం కోల్పోయిన ఏపీకి ఇస్తామన్నది.. కడతామన్న ఒక్క పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కిందకు నీరు తెచ్చే ప్రక్రియను కూడా ప్రారంభించారు. నిధులు మొత్తం ప్రతి రూపాయి కేంద్రం భరిస్తుందని చట్టంలో హామీ ఇచ్చారు. ఇప్పుడా ప్రాజెక్టు అంచనాను.. కొంత కొంతగా తగ్గించుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులకు రివర్స్ టెండర్లేసినట్లుగా.. పోలవరంకు రివర్స్ అంచనాలు వేసి అంతకంతకూ తగ్గించుకుంటూ వెళ్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు.
పోలవరం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం… భూసేకరణ, నిర్వాసితులకు సాయం వంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో కలిపి రూ.55, 548.87 కోట్లు. ఇందులో భూసేకరణ వ్యయం రూ.33,168.23 కోట్లు. కానీ అటు హెడ్ వర్క్స్లోనూ ఇటు భూసేకరణ వ్యయంలోనూ కేంద్రం భారీగా కోత పట్టి.. రూ.47,725.74 కోట్ల అంచనా వ్యయం ఫైలును కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వద్దకు ఈ ఫైలు వెళ్లింది. ఆర్థికశాఖ ఈ వ్యయాన్ని ఉన్నది ఉన్నట్లుగా అమోదించే అవకాశం లేదు. వారి లెక్కలు వారికి ఉంటాయి.. అటూ ఇటూ చేసి రూ. 33వేల కోట్లకే ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఏపీ సర్కార్ నోరెత్తి అడగలేని పరిస్థితి ఉంది. అంటే.. మొత్తంగా రూ. 22వేల కోట్లకు కోత పడుతుంది.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ను మార్చడంతో పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను ఓ సారి కేంద్రం రీఎంబర్స్ చేసింది.. వాటిని ఏపీ సర్కార్ ఉపయోగించుకుంది. దీనిపై విమర్శలు వచ్చాయి.ఇప్పుడు ఇంకా నిధులు రావాలని చెబుతోంది.. కానీ.. ఏపీ సర్కార్ పెట్టిన బిల్లులు చెల్లవని.. దాదాపుగా 700 కోట్లను చెల్లించడానికి నిరాకరిస్తుంది. మిగతా వాటి సంగతి ఇంకా పరిశీలనలోనే ఉంది. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఇంత మెతకగా వ్యవహరిస్తే.. పోలవరం మరో పదేళ్లయినా పూర్తయ్యే అవకాశం ఉండదు. హెడ్ వర్క్స్ పూర్తి చేసినా.. నీరు నిలిపే అవకాశం ఉండదు. నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా నీరు నిలపకూడదు. ఒక వేళ అలా నిలపాలంటే కడప జిల్లాలో గండికోట ముంపు నిర్వాసితులతో వ్యవహరించినట్లుగా వదిలేయాలి.