పోలవరంలో అవినీతి జరిగిందంటూ…ఏపీ సర్కార్ ఆదేశించిన విజిలెన్స్ విచారణలో కేంద్రం కూడా జోక్యం చేసుకోనుంది. తమ ప్రతినిధి.. ఆ విజిలెన్స్ కమిటీలో నియమించాలని నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీకి అవినీతి మరక అంటించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయంతో.. కేంద్రం ఉంది. పోలవరంలో ప్రతీ పనికి పీపీఏ ఆమోదముద్ర ఉండాలి. అలాగే గత ఐదేళ్లు పనులు జరిగాయి. కొత్త ప్రభుత్వం.. పోలవరం పనుల్లో తీవ్ర అవినీతి అంటూ… వచ్చీ రాగానే కమిటీలు వేసి.. కాంట్రాక్టులను రద్దు చేసింది. దీంతో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. న్యాయస్థానంలో పిటిషన్లు పెండింగ్‌లో పడిపోయాయి.
మొదటగా నిపుణుల కమిటీని నియమించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి… రోజుల వ్యవధిలోనే దాదాపుగా రూ. మూడు వేల కోట్ల అవినీతి జరిగిందనే నివేదిక తెప్పించుకున్నారు. దాన్ని కేంద్రానికి కూడా ఇచ్చారు. అయితే.. వాటికి ఆధారాలు సమర్పించాలని అడిగే సరికి.. యూటర్న్ తీసుకున్నారు. ఆ నివేదికను తాము విశ్వసించడం లేదని చెబుతూ… లేఖ రాశారు. పోలవరం పనుల్లో అక్రమాలేవీ చోటు చేసుకోలేదనే నివేదికను కూడా పంపారు. అయితే.. వెంటనే మళ్లీ… ఏపీ ప్రభుత్వం విజిలెన్స్ కమిటీని పోలవరం పనుల్లో అవకతవకలు అంటూ.. విచారణకు నియమించింది. ఇది అంతా.. ఓ ప్రణాళిక ప్రకారం.. కుట్ర ప్రకారం జరుగుతోందని పోలవరం ప్రాజెక్ట్ అధికారులు భావించారు. విచారణలో తమ అధికారి ఉండటం మంచిదన్న ఉద్దేశంతో… కేంద్ర జలశక్తి నియమించే అధికారిని… దర్యాప్తు బృందంలో సభ్యుడిగా నియమించాలని నిర్ణయించారు.
ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యం.. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమనేని పీపీఏ స్పష్టం చేసింది. వరద తగ్గినప్పటికీ పనులు ఎందుకు ప్రారంభించలేదని.. ఏపీ అధికారుల్ని ప్రశ్నించడంతో వారు నీళ్లు నమలాల్సి వచ్చింది. మేఘాతో కాంట్రాక్ట్ కుదుర్చుకునే పరిస్థితి లేదని.. కోర్టులో కేసు ఉందని.. తీర్పు వచ్చిన తర్వాత చేసుకుంటామని.. చెప్పుకొచ్చారు. మిగిలి ఉన్న పనులు.. మేఘాకు ఇస్తామని చెబుతున్న పనులకు సంబంధించి.. హెడ్‌వర్క్స్ పరిమాణంలో తేడాలున్నాయని పీపీఏ అధికారులు గుర్తించారు. అగ్రిమెంట్‌పై సంతకాలు చేసే సమయంలో ఆమోదించిన డిజైన్ మేరకు మిగిలిన పనులు అప్పగించాలని ఆదేశించారు.