ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. ఏపీ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.45 వేల కోట్ల వరకూ ఉంటే ఖర్చులు మాత్రం ఏకంగా రూ. లక్షా 24 వేల కోట్లుగా తేలింది. అంటే 75 వేల కోట్లకుపైగా లోటు. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేయడమో.. బకాయిలు పెట్టడమో చేశారన్నమాట. ఈ నెలలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఓవర్ డ్రాఫ్ట్లోనే ప్రభుత్వం సాగుతోంది. ఓ దశలో ఓడీ రూ.2,975 కోట్లకు చేరిపోయింది. నాలుగో తేదీన రూ.2 వేలకోట్లు అప్పు తీసుకుని ఓడీకి జమ చేశారు. మళ్లీ ఓడీ కింద అప్పు చేశారు. అయినా కొంతమందికి జీతాలు, పెన్షన్లు అందించలేకపోయారు.
అయితే కేంద్రం మాత్రం అడిగినన్ని అప్పులకు పర్మిషన్ ఇస్తూండటంతో ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా పోతోంది. ఏడాది మొత్తం తీసుకోవాల్సిన అప్పుల పరిమితి ముగిసిపోయింది. అయినా ఏదో కారణంతో అప్పులు ఇస్తూనే ఉంది. కానీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై నిఘా పెట్టినట్లుగా మాత్రం లీకులు ఇస్తోంది. తాజాగా కేంద్రం ఆర్థికశాఖకు ఓ లేఖ పంపిందని.. ఆర్థిక నిర్వహణపై పూర్తి స్థాయి సమాచారం కోరారన్న ప్రచారం జరుగుతోంది.
కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు, ఆస్తుల కల్పనకు తీసుకుంటున్న చర్యలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల నిధుల వివరాలు, కేంద్ర పథకాల నిర్వహణ, వాటికి కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర వాటా నిధులు, ఈ పథకాలను నిర్వహిస్తున్న ప్రభుత్వ సంస్థల వివరాలు చెప్పాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి ఆదేశాలు కేంద్రం చాలా సార్లు ఇచ్చింది. రాష్ట్రం చెప్పింది లేదు.. కంద్రం .. పట్టించుకున్నదీ లేదు. అటు కేంద్రం..ఇటు రాష్ట్రం తాము నిబంధనల ప్రకారం వెళ్తున్నామని కవరింగ్ చేసుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నట్లుగా ఉన్నాయని ఆర్థిక నిపుణుల భావన.