కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కోవిడ్ లెక్కలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటుంది. కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు ప్రెస్మీట్ పెట్టి వివరాలు ఇస్తూ ఉంటారు. అలా నిన్న ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ప్రెస్మీట్ పెట్టారు. దేశంలో కరోనా పరిస్థితిని వివరించారు. ఏ ఏ రాష్ట్రాల్లో కరోనా టెస్టులు ఎక్కువ చేశారో వివరించారు. ఎక్కడెక్కడ జాతీయ సగటు మించి కరోనా రికవరీలు ఉన్నాయో వివరించారు. అలాగే.. మరణాల శాతం.. కోలుకుంటున్నవారి సగటు.. ఇలా.. అంశాల వారీగా.. లెక్కలు చెప్పారు. రాష్ట్రాలను పోల్చారు. అయితే.. ఈ లెక్కల్లో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ అనే పేరే వినిపించలేదు. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని కేంద్రం అసలు పరిగణనలోకి తీసుకున్నట్లుగా కనిపించలేదు. పది లక్షల జనాభాకు సగటున 140కిపైగా పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల జాబితానూ విడుదల చేశారు. తాము ముందు 300కిపైగా పరీక్షలు చేస్తున్నామని ఏపీ సర్కార్ ప్రకటించింది. కానీ.. కేంద్రం మాత్రం.. నమ్మినట్లుగా లేదు. ఆ జాబితాలో చోటివ్వలేదు.
ఏపీ ప్రభుత్వం తాము రోజుకు 70వేల టెస్టులు చేస్తున్నామని.. లెక్కలు ప్రకటిస్తోంది. కానీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం.. ఏపీ టెస్టులను పరిగణలోకి తీసుకోవడం లేదు. అసలు అన్ని టెస్టులు ఎలా చేస్తారని.. సామాన్యులకు కూడా డౌట్ వస్తుంది. అయితే.. దబాయింపులతో నడిచిపోతున్న ఏపీ సర్కార్ తీరు.. కేంద్రం వద్ద చెల్లుతున్నట్లుగా లేదు. ఏపీ ఎన్ని టెస్టులు చేశామని చెబితే.. అన్ని టెస్టులు రాసుకోవడం లేదు. ఏపీలో ఉన్న సామర్థ్యానికి.. పదివేల టెస్టులు చేయగలిగితేనే గొప్ప. ఆర్టీ పీసీఆర్, ట్రూనాట్ కేంద్రాల ద్వారా.. ఇరవై నాలుగు గంటలూ టెక్నిషియన్లు పని చేసినా.. అంత మేర టెస్టు రిపోర్టులు తేవడం సాధ్యం కాదు. ఈ విషయం కేంద్రానికి బాగా తెలిసినట్లుగానే ఉంది.
అదే సమయంలో.. జాతీయ సగటు కన్నా.. ఏపీ రికవరీలు చాలా ఎక్కువని.. మరణాల్లో కూడా అంతేనని ప్రభుత్వ వర్గాలు ఉదరకొడుతూ ఉంటాయి. కానీ.. ఎక్కువగా రికవరీలు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ లేదు. అలాగే.. తక్కువ మరణాలు ఉన్న రాష్ట్రాల్లోనూ ఏపీ లేదు. అసలు కరోనా లెక్కల విషయంలో ఏపీని కేంద్రం పరిగణలోకి తీసుకుందో లేదో కూడా.. ఎవరికీ తెలియదు. ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తుందని.. కేంద్రానికి అర్థమై.. అసలు లెక్కలు పరిగణనలోకి తీసుకోవడం లేదా..? అన్న కేంద్ర ఆరోగ్య శాఖ… విడుదల చేసిన గణాంకాలు చూస్తే అనుమానం వస్తోంది. దీనిపై ఏపీ సర్కారే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.