నేరస్తులను శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయడానికి భారతీయ జనతా పార్టీ సర్కార్ సానుకూలంగా లేదు. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించిది. నేర నేతలను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పించాలని పోటీ నుంచి అనర్హుల్ని చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు… కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.ఈ నోటీసులకు సమాధానం ఇచ్చిన కేంద్రం.. ఆ ప్రతిపాదనకు తాము అనుకూలం కాదని తెలిపింది. ప్రస్తుత చట్టాల ప్రకారం.. నేరస్తులైన నేతలకు రెండేళ్ల వరకూ శిక్ష పడితే.. ఆరేళ్ల వరకూ పోటీకి అనర్హులు అవుతారు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశం కూడా కల్పించవద్దని.. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
అయితే.. కేంద్రం మాత్రం… శిక్ష పడిన నేతల్ని పూర్తిస్థాయిలో రాజకీయాలకు దూరం చేయాలన్న ప్రతిపాదనకు సిద్ధంగా లేదు. ఉద్యోగాలు… ఇతర అంశాల్లో ఒక సారి శిక్ష పడితే.. ఆ వ్యక్తిని దూరంగా పెడతారని.. అర్హుడు కాకుండా పోతాడని.. అలాంటిది.. రాజకీయాల్లో మాత్రం.. ఎందుకు కొనసాగించాలని.. పిటిషనర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు. పైగా ఉద్యోగులు చట్టాలు చేయరని.. కానీ శిక్ష పడిన వారి మళ్లీ చట్టసభల్లోకి చట్టాలు చేస్తున్నారని… ఇదే దేశానికి అతి పెద్ద సమస్యగా మారుతోందని అంటున్నారు. ప్రస్తుతం ఏడాదిలోపు రాజకీయ నేతలపై ఉన్న కేసుల విచారణనుపూర్తి చేయాలన్న సంకల్పంతో సుప్రీంకోర్టు ఉంది. అలా విచారణ పూర్తయితే… చాలా మందికి శిక్షలు ఖరారవుతాయి.
ఒక్క సారి శిక్ష ఖరారయితే.. ఇక రాజకీయాలకు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిని కేంద్రం వద్దనుకుంటున్నట్లుగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నేరస్వభావం ఉన్న నేతల వల్లనే రాజకీయ వాతావరణం కలుషితం అవుతోందని విమర్శలు వస్తున్నాయి. అలాంటి వారిని దూరం చేస్తేనే.. రాజకీయాలు బాగుపడతాయని వస్తున్న విశ్లేషణలు.. అభిప్రాయాలను కేంద్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.