సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు కేంద్రం పొమ్మనకుండా పొగ పెడుతోంది. ఆ సోషల్ మీడియాసైట్కు ఉన్న “సేఫ్ హార్బర్” అడ్వాంటేజ్‌ను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంటే.. ఇంతకు ముందుకు వరకు సోషల్ మీడియా సైట్లన్నింటికీ మధ్యవర్తి హోదా ఉండేది. అంటే.. ఆ సైట్లలోపోస్ట్ చేసే సమాచారానికి ఆ సైట్లకు సంబంధం ఉండదు. కానీ ఇప్పుడు ఈ మధ్యవర్తి హోదాను తీసేయడం ద్వారా.. ట్విట్టర్లో పోస్ట్ చేసే ప్రతి సమాచారానికి ట్విట్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాటిపై కేసులుపెట్టే స్వేచ్చ పోలీసులకు ఉంటుంది. ఇలా ట్విట్టర్‌కు మధ్యవర్తి హోదా తీసేయగానే.. అలా కేసులు పెట్టడం కూడా ప్రారంభమయింది.
ఉత్తరప్రదేశ్‌లో మతపరమైన హింసను ప్రోత్సహించారంటూ ట్విట్టర్‌తోపాటు పలువురు జర్నలిస్టులపైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ జర్నలిస్టులు సమచారాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ కారణంగా.. ట్విట్టర్‌పైనా కేసు పెట్టారు. నిజానికి ట్విట్టర్ కేంద్రం ప్రకటించిన విధంగా.. నిబంధనలు పాటిస్తామని.. ఆఫీసర్ల నియామకాల కోసం ఇప్పటికే తాత్కాలిక చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్‌ను నియమించామని కేంద్ర ప్రభుత్వానికి సమాచారం పంపింది. ఈ వివరాలను ఐటీ మంత్రిత్వ శాఖతో పంచుకుంటామని కూడా ప్రకటించింది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా తాము అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ..కేంద్రం ట్విట్టర్ కు పొగపెట్టాలనే నిర్ణయించుకుంది.
ఫేస్బుక్,వాట్సాప్‌లతో కేంద్రానికి పెద్దగా పట్టింపులు లేవు. కానీ ట్విట్టర్ మాత్రం… కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా చేయడం లేదు. పైకి కొత్త రూల్స్ అనే నిబంధన చెబుతున్నప్పటికీ.. అసలు ట్విట్టర్లో కేంద్రానికి వ్యతిరేకంగా వస్తున్న వార్తలను ఫిల్టర్ చేయడం లేదని.. బీజేపీ నేతల పోస్టులకు .. ఫేక్ అనే ట్యాగ్లు తగిలిస్తున్నారని కేంద్రం గతంలోనే కన్నెర్ర చేసింది. అయితే.. ట్విట్టర్ మాత్రం వినియోగదారుల ప్రైవసీకే ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో కేంద్రం.. ట్విట్టర్‌ను టార్గెట్ చేసుకుంది. నేరుగా బ్యాన్ చేస్తే… అప్రజాస్వామ్యం అనే విమర్శలు వస్తాయని… కేసులు పెట్టి.. దేశం నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నారన్న విమర్శలు కేంద్రం ఎదుర్కొంటోంది.