” కరెంటు రేట్లు చూడండి. ఇతర రాష్ట్రాల్లో సోలార్, విండ్ పవర్ కోసం గ్లోబల్ టెండరింగ్ చేస్తూ యూనిట్ రూ.2.65కు, రూ.3కే అందుబాటులో ఉంటే, మన రాష్ట్రంలో ఎంతో తెలుసా? యూనిట్‌కు రూ.4.84తో నిన్నటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసింది. ఈ రకంగా దోచుకుంటున్న పరిస్థితి. అదే పీక్ అవర్స్ అయితే, దోచుకున్నది చాలదన్నట్టుగా అక్షరాల యూనిట్ రూ.6 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీ కళ్లెదుటకే తీసుకొచ్చి, మీ ఈ రేట్లన్నీ పూర్తిగా తగ్గిస్తాను…”
ఇది మే 30వ తేదీన ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగంలో కరెంట్ కొనుగోలు ఒప్పందాల… ( పీపీఏ)పై చేసిన ఆరోపణలు. అంతే కాదు.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా.. పలుమార్లు… ఆ విద్యుత్ ఒప్పందాలన్నీ సమీక్షిస్తామని రద్దు చేస్తామని ప్రకటించారు.
కరెంట్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షిస్తామన్న జగన్..!
సాధారణంగా విద్యుత్ ఒప్పందాలు.. ఇతర విషయాల గురించి తెలియని వాళ్లు.. సామాన్యులు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలను.. నమ్ముతారు. నిజమే కాబోలు.. అంతకు కొంటున్నారేమో… అంత కంటే.. తక్కువకే దొరుకుతున్నాయేమో.. అవినీతి జరుగుతుందేమో అనుకుంటారు. అలా ప్రచారం చేయడం రాజకీయ నేతల లక్షణం అనుకుందాం. కానీ.. పారిశ్రామిక వేత్తలను.. పెట్టుబడులు పెట్టిన వాళ్లను బయటపెట్టేలా హెచ్చరికలు చేయడం మాత్రం.. కాస్త సీరియస్ విషయమే. అందుకే.. జగన్మోహన్ చేసిన వ్యాఖ్యలు.. కేంద్ర ప్రభుత్వం వరకూ వెళ్లాయి. వెంటనే ఓ లేఖను.. ప్రభుత్వ వర్గాలకు కూడా పంపాయి.
సీఎంకు నిబంధనల గురించి చెప్పాలని సీఎస్‌కు కేంద్రం లేఖ..!
కేంద్ర ఇంధన, సంప్రదాయేతర వనరుల సెక్రటరీ ఆనంద్ కుమార్.. సూటిగా సుత్తి లేకుండా.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి లేఖ రాశారు. మీ ప్రభుత్వం .. సోలార్, విండ్ పవర్ ఒప్పందాలపై ఇలా అంటున్నట్లు తెలిసింది. మీకు నిబంధనలు, చట్టాలు తెలియవా.. అన్నదే.. ఆ లేఖ సారాంశం. ఇలాంటి ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారిలో అభద్రత పెరుగుతుందని.. అది అంతిమంగా నష్టం చేకూరుస్తుందని.. చెప్పేశారు. 2022 కల్లా భారత ప్రభుత్వం సాధించాలనుకున్న ఉత్పత్తి లక్ష్యానికి ఏపీ ప్రభుత్వ వ్యవహారం అడ్డంకిగా మారుతుందని.. అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రికి చెప్పాలని కూడా.. ఎల్వీ సుబ్రహ్మణ్యానికి స్పష్టమైన సూచనలు చేశారు.
ఏమి జరిగిందో తెలియకుండా అవినీతి అంటే ఎవరికి నష్టం..?
జగన్మోహన్ రెడ్డి లెక్కలో ఏపీలో జరిగిన ప్రతీ ఒక్కటి అవినీతే. ప్రతీ పనిని.. ప్రతీ కాంట్రాక్టును.. ప్రతీ ప్రాజెక్టును ఆయన సమీక్షించాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా.. ఇప్పటికే.. దాదాపుగా ప్రాజెక్టులన్నింటినీ నిలిపి వేశారు. అమరావతిపై క్లారిటీ లేదు. ఇవన్నీ… ఏపీకి ఎంత మాత్రం క్షేమకరం కాదన్న వాదన ఆర్థిక నిపుణుల నుంచి వస్తోంది. కానీ.. వినిపించుకునే పరిస్థితిలో కొత్త సీఎం లేరు.