సినీ, టీవీ రంగాలకు కేంద్రం నుంచి ఓ శుభవార్త. కరోనాతో షూటింగులకు పడిన అడ్డుకట్ట తొలగిపోయింది. ఇక నిరభ్యంతరంగా షూటింగులు చేసుకోవొచ్చని కేంద్రం తెలిపింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కొన్ని మార్గ దర్శకాలనీ నిర్దేశించారు. కెమెరా ముందు కనిపించే నటీనటులు తప్ప, మిగిలినవాళ్లంతా తప్పసరిగా మాస్క్లు ధరించాలని, పార్కింగ్ ఏరిమయాలో జనం గుమ్మిగూడదని, సాధ్యమైనంత వరకూ తక్కువ మందితో షూటింగులు చేసుకోవాలని పేర్కొంది. అంతేకాదు.. షూటింగ్ స్పాట్ లో ధర్మల్ స్క్రీనింగ్ తప్పని సరి అని, కరోనా లక్షణాలు లేని వాళ్లని మాత్రమే షూటింగులకు అనుమతి ఇవ్వాలని పేర్కొంది. ఆరోగ్య సేతు యాప్ ని విధిగా అందరూ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ధియేటర్లలోనూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని, అందుకు తగ్గట్టుగా సీటింగ్ లో మార్పులు చేయాలని, టికెట్లని సైతం ఆన్ లైన్ లోనే విక్రయించాలని సూచించింది. దీన్ని బట్టి చూస్తుంటే త్వరలోనే థియేటర్లకూ అనుమతి ఇచ్చే అవకాశాలున్నాయని స్పష్టం అవుతోంది. కేంద్ర విధివిధానాలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుని, థియేటర్లని సిద్ధం చేసుకుంటే – త్వరలోనే బొమ్మ పడే అవకాశం వుంది.