రైతుల మోటార్లకు కరెంట్ మీటర్లు పెడితే నాణ్యమైన విద్యుత్ వస్తుందని ఏపీ ప్రభుత్వ పెద్దలు ఘనంగా ప్రచారం చేసి మీటర్లు పెట్టేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పెట్టేశారు. ఇతర జిల్లాల్లో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే .. అప్పు కోసం అని అందరికీ తెలుసు. కేంద్ర సంస్కరణలు అమలు చేస్తే అప్పు ఇస్తారు. ఆ అప్పు కోసం ఏపీ సర్కార్ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేందుకు నిర్ణయించింది. రైతుల్లో వ్యతిరేకత తెస్తుందని భావించినా ముందుకే వెళ్లారు.
ఉచిత విద్యుత్‌కు బదులు నగదు బదిలీ ప్రవేశ పెడుతున్న జగన్ సర్కార్ !
మోటార్లకు మీటర్లు పెట్టడం రైతుల మెడకు ఉరి తాళ్లు వేయడమేనని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అలా మీటర్లు మాత్రమే పెట్టరని రైతులకు బిల్లులు కూడా వస్తాయని చెబుతున్నారు. నిజంగానే బిల్లులుస్తాం కానీ .. డబ్బులు రైతులకు నగదు బదిలీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. జీతాల కోసం ప్రతీ నెలా అప్పు చేయాల్సిన పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం ప్రతి నెలా ఠంచన్‌గా బిల్లులు ఇస్తుందంటే రైతుల్లోనూ నమ్మకం లేదు. అందుకే అపనమ్మకం ఏర్పడింది. అయితే ప్రభుత్వం మాత్రం … ఏ సంకోచం లేకుండా ముందుకే వెళ్తుంది.
అప్పు కోసం తప్పలేదు.. ఇప్పుడు మోటార్లకు వద్దు ట్రాన్స్ ఫార్మర్లకు చాలని కేంద్రం కొత్త రూల్ !
అయితే ఏపీ తరహాలో అప్పుల కోసం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడానికి చాలా రాష్ట్రాలు అంగీకరించలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వెనుకడుగు వేస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం వ్యూహం మార్చింది. సంస్కరణల్లో మోటార్లకు మీటర్లు పెట్టాలనే నిబంధన తొలగిస్తున్నట్లుగా కేంద్ర వర్గాలు తెలిపాయి. ఈ మేరకు చట్ట సవరణ కూడా చేయనున్నారు. మోటార్లకు పెట్టే బదులు ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర పెడితే చాలని కేంద్రం నిబంధన మార్చబోతోంది.
ఇప్పుడు మీటర్ల విషయంలోనూ నాలుక మడతేయడం తప్పదా !?
కేంద్రం ఇలా మనసు మార్చుకోవంతో ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఏపీ సర్కార్‌కు ఇబ్బంది ఏర్పడనుంది. మోటార్లకు మీటర్లతో ఎలాంటి రైతులకు మేలనే విచిత్ర వాదనను వినిపిస్తూ వస్తున్న ఏపీ సర్కార్ కూడా ఇప్పుడు వెనక్కితగ్గక తప్పదు. పెడితే పెట్టుకోవచ్చు. కానీ రైతులు ఊరుకోరు. ఇప్పుడు వెనక్కి తగ్గితే గతంలో మంచే అన్నారు కదా అని విపక్షాలు ఎదురుదాడి చేస్తాయి. అందుకు ఇప్పుడు మోటార్లకు మీటర్ల విషయంలోనూ వైసీపీ సర్కార్‌కు మాట మార్చక తప్పని పరిస్థితి.