ఏపీ ప్రభుత్వం తరపున జగన్ రెడ్డి ఎన్ని అప్పులు చేస్తున్నారో చూస్తూంటే ఆర్థిక నిపుణులకు మైండ్ బ్లాంక్ అవుతుంది . ఆదాయం కన్నా దాదాపుగా రెట్టింపు అప్పులు చేస్తున్నారు. ఇంత అప్పులు ఎలా ఇస్తున్నాన్నది పెద్ద పజిల్, ఈ ఏడాది ఇచ్చిన రుణ పరిమితి అయిపోయింది. మరో 700 కోట్ల రూపాయలకే చాన్స్ ఉంది. కానీ ఈ మంగళవారం మూడు వేల కోట్లు అప్పు తీసుకోవడానికి ఇండెంట్ పెట్టింది. ఎలా అంటే… కేంద్రం ఏదో దొడ్డిదారిన అనుమతి ఇచ్చేసి ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇస్తుంది. ఆ తర్వాత మందు బాబుల్ని తాకట్టు పెట్టి మరో 12వేల కోట్లు తీసుకురానుంది. దానికీ అడ్డుచెప్పదు. కానీ ఇదే కేంద్రం కేరళ విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం కేరళ రుణ పరిమితిపై కోత విధించింది. చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో (జీఎస్డీపీ)లో మూడు శాతం వరకూ మార్కెట్ నుండి రుణం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు అదనంగా మరో 0.5% రుణం పొందే అవకాశం ఉంది కేంద్రం ఇటీవల రాష్ట్రాల రుణ పరిమితిని రెండు శాతానికి కుదించింది. కేరళ జీఎస్డీపీ రూ.11 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. మూడున్నర శాతం రుణ పరిమితికి అవకాశం ఇస్తే రాష్ట్రం రూ.38 వేల కోట్లు రుణం పొందవచ్చు. అయితే ఆర్థిక సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల్లో కేవలం రూ.15,390 కోట్లు మాత్రమే రుణం పొందవచ్చునని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన మూడు నెలలలో రూ.5,131 కోట్ల రుణం తీసుకోవచ్చు. మొత్తంగా చూస్తే 2023-24లో కేరళ రూ.20,690 కోట్ల రుణం పొందే అవకాశం మాత్రమే ఉంది.
అంటే ఏడాది మొత్తం కేరళ చేసే రుణం ఏపీ దాదాపుగా ఒక్క నెలలో చేస్తుందన్నమాట. మరి కేరళ కంటే ఆదాయం చాలా ఎక్కువా అంటే… మొత్తం పన్నులు.. కేంద్ర వాటా ఇతర ఆదాయాలన్నీ కలిపి ఏపీ ఏడాది ఆదాయం రూ . 70 వేల కోట్లకు అటూఇటూగానే ఉంటుది. మిగతా బడ్జెట్ అంతా అప్పులతో కవర్ అయ్యేదే. కానీ కేరళకు గత ఏడాది ఆదాయం రూ. 1,29,268 కోట్లు . అంటే… ఏపీ కన్నా చాలా ఎక్కువ. మరి ఏపీకి అన్ని వేలకోట్లు అప్పులు చేయడానికి ఎలా అనుమతి వస్తోంది.
కాగ్ ప్రతి నెలా రాష్ట్రాల ఆదాయవ్యయాలను ఆడిట్ చేయాలి. కానీ ఏపీ సర్కార్ ఇచ్చినవే రాసుకుంటోంది. కనీసం ఆడిట్ చేయడం లేదు. అంతే కాదు.. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నరుణాల లెక్కలు ఇవ్వకపోయినా అడగడం లేదు. అదే ఇష్టం లేని ప్రభుత్వాలకు మాత్రం… చాయిస్ ఉన్నా… కాళ్లూ.. చేతూలు కట్టేస్తోంది.