ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర రైల్వే శాఖ ఓ రైల్వే లైన్ మంజూరు చేసింది. ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతి – హైదరాబాద్, చెన్నై – కోల్‌కతాలను అనుసంధానం చేసేలా రైల్వే లైన్ నిర్మించనున్నారు. మధ్య, ఈశాన్య భారతాన్ని దక్షిణ భారతదేశానికి అనుసంధానాన్ని మరింత మెరుగుపరచేలా చర్యలు చేపట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై 3 కిలోమీటర్ల పొడవైన వంతెనను నిర్మించనున్నారు. దాదాపు 57 కి.మీ మేర చేపట్టే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,245 కోట్లు అని ప్రకటించారు.ఈ రైల్వే లైన్ గురించి కేంద్ర కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మ్యాప్‌ను చూపించి ఎలా నిర్మిచంబోతున్నామో చెప్పారు. మూడు కిలోమీటర్లకుపైగా ఉండే నదిపై వంతెన సరికొత్త రీతిలో ఉండనుంది.
రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రం చేపట్టే ప్రాజెక్టుల నుంచి గరిష్టంగా ఏపీకి ప్రయోజనం లభించేలా చేసుకుంటున్నారు. అదే సమయంలో ప్రత్యేకమైన నిధులను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర వాటాగా కట్టాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ను గత ప్రభుత్వం కట్టకపోవడంతో అసలు పనులే జరగలేదు.