పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద శాతం అమ్మాలని నిర్ణయించారో.. అలాగే.. ప్రభుత్వ రంగంలోని ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం అనుమతినిచ్చేసింది. పేరుకు విదేశీ పెట్టుబడులు కానీ… వంద శాతం అంటే.. యాజమాన్యం మారిపోవడమే. భారత్లో రెండో అతి పెద్ద అయిల్ కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ . ఇందులో కేంద్రానికి 52.98 శాతం వాటాలు ఉన్నాయి. వాటిని పూర్తిగా విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇప్పటికే బీపీసీఎల్ అమ్మకం ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కొనేందుకు మూడు విదేశీ కంపెనీలు దూసుకు వచ్చాయి. వేదాంతాతో పాటు, అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు అపోలో గ్లోబల్, థింక్ గ్యాస్ వంటి సంస్థలు పోటీ పడుతున్నాయి. బీపీసీఎల్ అమ్మకం పూర్తయితే ఐఓసీ మాత్రమే ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉండే ఏౖకైక చమురు రిఫైనింగ్ కంపెనీగా ఉంటుంది. తర్వాత దాన్ని కూడా అమ్మేసే అవకాశం ఉంటుంది. దేశంలో ఎవరేమనుకున్నా.. బడా సంస్థలను తెగ నమ్మేయాలన్న లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి ఎలాంటి కారణాలు లేవు.
పెట్టుబడుల ఉపసంహరణకు అధికారం కేంద్రానికి ఉందని.. అందుకే అమ్ముతున్నామని కేంద్రం చెబుతోంది. ఎవరూ అడ్డుకోలేరని కూడా వాదిస్తోంది. దానికి తగ్గట్లుగానే ముందుకెళ్తోంది. ఇప్పటికే పెట్రో ధరలపై నియంత్రణ లేకుండా పోయింది. కేంద్రం అవసరానికి మాత్రం పెంచకుండా ఆపడమో.. తగ్గించడమో చేస్తున్నారు కానీ… పెంపు మాత్రం నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఇది ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే.. ధరలు మరింత పెరగడం ఖాయంగా భావిస్తున్నారు.